టెన్త్‌లో నూరుశాతం ఉత్తీర్ణత తప్పనిసరి
● పటిష్టంగా వందరోజుల యాక్షన్ ప్లాన్
● కలెక్టర్ దినేష్‌కుమార్
పాడేరు : ప్రభుత్వ పాఠశాలలు, గిరిజన సంక్షేమ ఆశ్రమ, గురుకుల పాఠశాలలో చదువుతున్న టెన్త్ విద్యార్థులు వచ్చే ఏడాది పబ్లిక్ పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. శనివారం తన కార్యాలయం నుంచి విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. టెన్త్ విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యాశాఖ అధికారులు వంద రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేసి పటిష్టంగా అమలు చేయాలన్నారు. యాక్షన్ ప్లాన్ అమలుతీరును పరిశీలించేందుక ఐటీడీఏల్లో ఏర్పాటు చేసిన మానటరింగ్ సిస్టం ద్వారా పీవోలు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. విద్యార్థులు చదువులో మెరుగ్గా రాణించేందుకు తరచూ పోటీ పరీక్షలు నిర్వహించాలన్నారు. చదువుల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. యాక్షన్ ప్లాన్ అమలు చేయడంలో పాఠశాల హెచ్‌ఎంలు, ఎంఈవోలు ముఖ్య భూమిక పోషించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యశాఖాధికారి రామకృష్ణారావు, టీడబ్ల్యూ డీడీ పరిమళ, మండల విద్యాశాఖ అధికారులు, ఏటీడబ్ల్యూవోలు పాల్గొన్నారు.


