విభిన్న ప్రతిభావంతులకు సముచిత స్థానం
● కలెక్టర్ దినేష్‌కుమార్
● ఉపకరణాల పంపిణీ
పాడేరు : విభిన్న ప్రతిభావంతులకు సమాజంలో సముచిత స్థానం కల్పించాలని కలెక్టర్ దినేష్‌కుమార్ సూచించారు. శనివారం కలెక్టరేట్ ప్రాంగణంలో విశాఖపట్నం ఎబిలిటీ రీ హెబిలిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో పలువురు దివ్యాంగులకు వీల్‌చైర్లు, ఉపకరణాలు పంపిణీ చేశారు. కుమ్మరిపుట్టు గ్రామానికి చెందిన వినిత అనే రెండేళ్ల దివ్యాంగురాలు త్వరగా కోలుకునేలా పౌష్టికాహారం, ఫిజియోథెరపి అందించాలని ఆదేశించారు. శారీరక అంగ వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు జిల్లా ఆస్పత్రిలో రీహెబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. శారీరక, మానసిక ఎదుగుదల లోపంతో బాధపడుతున్న చిన్నారులకు ఫిజియోథెరపి, న్యూట్రిషన్ అందిస్తామన్నారు. రీహెబిలిటేషన్ సెంటర్ డైరెక్టర్ దిలీప్‌పాత్రుడు, కౌన్సిలర్ స్వప్న పాల్గొన్నారు.


