చలిమంటకువృద్ధురాలికి గాయాలు
రాజవొమ్మంగి: చలి నెగడు నుంచి మంటలు ఎగసి మండలంలోని అప్పలరాజుపేటకు చెందిన కేదారి అప్పయమ్మ (70) శనివారం తీవ్రంగా గాయపడింది. అప్పయమ్మ ఒంటరిగా ఓ పాకలో నివసిస్తోంది. ఆమె ఏర్పాటు చేసుకొన్న చలి మంట నుంచి అర్ధరాత్రి అగ్నికీలలు పైకి ఎగసి ఆమె శరీరంపై, దుస్తులు, మంచంపై పడి కాలిపోవడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. శనివారం తెల్లవారుజామున స్థానికులు గమనించి ఆమెకు సపర్యలు చేశారు. స్థానిక ఆశ వర్కర్ రత్నం, అంగన్‌వాడీ కార్యకర్త కుమారి అప్పయమ్మను 108 సహాయంతో రాజవొమ్మంగి పీహెచ్‌సీకు తరలించారు. డాక్టర్ శివారెడ్డి ప్రథమ చికిత్స అందజేశారు. అప్పయమ్మకు 72 శాతం కాలిన గాయాలయ్యాయని, మెరుగైన చికిత్స కోసం నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశామన్నారు. నిరుపేద గిరిజన మహిళ అయిన అప్పయమ్మను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎంపీటీసీ సభ్యుడు పెద్దిరాజు బాధితురాలిని పరామర్శించి ధైర్యం చెప్పారు.


