స్లో..లార్‌! | - | Sakshi
Sakshi News home page

స్లో..లార్‌!

Dec 28 2025 7:39 AM | Updated on Dec 28 2025 7:39 AM

స్లో..లార్‌!

స్లో..లార్‌!

పీఎం సూర్యఘర్‌కు అంతంతమాత్రంగా స్పందన

సాక్షి, విశాఖపట్నం: ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలో పీఎం సూర్యఘర్‌కు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. సబ్సిడీ, రుణ సదుపాయంతో ప్రతి ఇంటికి సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అవకాశం ఉన్నా.. వినియోగదారులు ఆసక్తి చూపించడం లేదు. ఫలితంగా సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటులో ఏపీఈపీడీసీఎల్‌ ఆశించిన ప్రగతిని సాధించలేకపోతోంది. మరోవైపు.. ఏదో సాధించేశామని చెప్పుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం.. సోలార్‌ రూఫ్‌టాప్‌లని వీలైనంత ఎక్కువగా ఏర్పాటు చేయించాలంటూ డిస్కమ్‌లపై పదే పదే ఒత్తిడి తీసుకొస్తోంది. దీంతో అధికారులు, ఉద్యోగులు తమ విధులను పక్కన పెట్టి.. సోలార్‌పైనే దృష్టిసారించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

12 శాతం లక్ష్యాన్ని కూడా చేరలేక..!

ఈపీడీసీఎల్‌ పరిధిలో 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్‌ వినియోగిస్తున్న వారు 3 లక్షల మంది వరకు ఉండగా.. సోలార్‌ ప్లాంట్లను కేవలం 36 వేల మంది మాత్రమే ఇప్పటి వరకూ అమర్చుకున్నారు. కనీసం 12 శాతం కూడా లక్ష్యాన్ని సాధించలేకపోవడంతో ఉన్నతాధికారులు ఉద్యోగులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. ఈ పథకం ప్రకారం ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలో మొత్తం 36 వేల గృహాలకు 114 మెగావాట్ల సామర్థ్యంతో రూఫ్‌ టాప్‌ సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. విశాఖ పరిధిలోనూ ఇదే పరిస్థితి దాపురించింది. 200 యూనిట్లు పై చిలుకు విద్యుత్‌ వినియోగదారులు 1.83 లక్షల మంది విశాఖలో ఉండగా 13,500 కిలోవాట్లు సామర్థ్యంతో 3,750 మంది మాత్రమే అమర్చుకున్నారు. అనకాపల్లి సర్కిల్‌ పరిధిలో 2,841 మందికి 8,712 కిలోవాట్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో 15 మందికి 48 కిలోవాట్ల సోలార్‌ ప్లాంట్లు మాత్రమే అమర్చారు. దీంతో అనుకున్న స్పందన లేకపోవడంతో కచ్చితంగా పరిధిలోకి వచ్చే వారందరినీ.. పీఎం సూర్యఘర్‌ పథకం లోకి మార్చాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో ఈపీడీసీఎల్‌ ఉద్యోగులు బేజారవుతున్నారు. విద్యుత్‌ సరఫరాకు సంబంధించిన అంశాల కంటే సూర్యఘర్‌ ఒత్తిడే ఎక్కువగా ఉంటోందని ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామనీ.. ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదని చెబుతున్నారు. సోలార్‌ ప్యానెల్స్‌ అమర్చిన తర్వాత.. పాడైతే.. దాన్ని బాగుచేసేందుకు అధిక భారం పడుతుందనీ.. అందుకే ఎవరూ పట్టించుకోవడంలేదనీ.. అయినా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విశాఖ సర్కిల్‌ పరిధిలో 200 యూనిట్లకు పైగా విద్యుత్‌ వినియోగదారులు1.83 లక్షల మంది విశాఖలో సోలార్‌ ప్లాంట్లు అమర్చుకున్నది3,750 (13,500 కిలోవాట్లు) అనకాపల్లి సర్కిల్‌ పరిధిలో 2,841 మంది (8,712 కిలోవాట్లు) అల్లూరి సర్కిల్‌ పరిధిలో15 మంది (48 కిలోవాట్లు)

కరెంట్‌ అమ్మితే మీకే లాభం అని చెప్పండహో..!

అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తామంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు.. ఇప్పుడు ఎఫ్‌పీసీసీఏ చార్జీలంటూ బిల్లు చూస్తే గుండె గుభేల్‌మనిపించేలా చేస్తున్నారు. సంపద సృష్టించడం తనకు తెలుసన్న ఆయన ఓవైపు విద్యుత్‌ బిల్లుల్ని అమాంతం పెంచేసి.. మరోవైపు.. సూర్యఘర్‌ ప్రాజెక్టు పేరుతో వినియోగదారుల నడ్డి విరించేందుకు యత్నిస్తున్నారు. సోలార్‌ రూఫ్‌టాప్‌ పెట్టుకుంటే బిల్లు కట్టకపోవడంతో పాటు కరెంటు అమ్ముకొని లాభాల్ని పొందొచ్చంటూ ప్రజల్ని మభ్యపెడుతున్నారు. 3 కిలోవాట్లు ఏర్పాటు చేసుకున్న ఇంటికి నెలకు 360 నుంచి 450 యూనిట్లు విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. ఇంటి అవసరాలకు వినియోగించుకోగా.. మిగిలిన విద్యుత్‌ను ఏపీఈపీడీసీఎల్‌కు విక్రయించుకోవచ్చనే విషయాన్ని ప్రజలకు వివరించాలంటూ ఉద్యోగుల్ని ఆదేశించారు. అయినా ప్రజలు స్పందించకపోవడంతో అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈపీడీసీఎల్‌ పరిధిలో సర్కిళ్లలోని జోన్లవారీగా టార్గెట్స్‌ విధించారు. నిర్దేశించిన సమయంలోగా టార్గెట్‌ పూర్తి చేయాలని ఆదేశిస్తుండటంతో.. పీఎం సూర్యఘర్‌ అధికారుల మెడపై కత్తిగా మారింది.

టార్గెట్‌ పూర్తి చేయలేదని కింది స్థాయి ఉద్యోగులపై అధికారుల చిర్రుబుర్రు

తలనొప్పిగా మారిందంటున్న విద్యుత్‌ శాఖ ఉద్యోగులు

ఇప్పటివరకు డిస్కమ్‌ పరిధిలో 36 వేల మంది ఏర్పాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement