ఆర్టీసీ బస్సుకు త్రుటిలో తప్పిన ప్రమాదం
చింతూరు: మారేడుమిల్లి, చింతూరు ఘాట్‌రోడ్‌లో ఆర్టీసీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. తులసిపాక సమీపంలోని దుర్గమ్మ గుడివద్ద శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గోకవరం డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ సర్వీసు రాజమహేంద్రవరం నుంచి భద్రాచలం వెళ్లేందుకు మధ్యాహ్నం 1.50కు బయలుదేరింది. ఘాట్‌రోడ్‌లోని దుర్గమ్మ గుడి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో కల్వర్టును బస్సు ఢీకొట్టినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. కల్వర్టు వల్ల నిలిచిపోవడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. బస్సు రేడియేటర్ పగిలిపోవడంతో డ్రైవర్ బస్సును అతికష్టంతో తులసిపాక వరకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి కొంతమంది ప్రయాణికులు ఇతర వాహనాల్లో వెళ్లిపోయారు. మిగిలిన వారు తరువాత వచ్చిన బస్సులో గమ్యస్థానాలకు వెళ్లారు. ఇటీవల ఇదే ఘాట్‌రోడ్‌లో ఓ ప్రైవేటు బస్సు లోయలో పడిన ఘటనలో తొమ్మిది మృతి చెందిన నేపథ్యంలో తాజాగా జరిగిన ప్రమాదంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రాంతంలో కాకుండా ఘాట్‌రోడ్డులో మరో చోట జరిగి ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదని వారు పేర్కొన్నారు.
లారీని తప్పించబోయి
కల్వర్టును ఢీకొన్న బస్సు


