మూగబోయిన సెల్ సేవలు
● కండ్రుమ్, కితలంగి పంచాయతీల్లో
స్తంభించిన బీఎస్‌ఎన్‌ఎల్ సిగ్నల్ వ్యవస్థ
● సచివాలయ సేవలకు అంతరాయం
డుంబ్రిగుడ: మండలంలోని కండ్రుమ్, కితలంగి పంచాయతీల్లో బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ సేవలు స్తంభించాయి. దీంతో గత 20 రోజులగా సిగ్నల్ వ్యవస్థ పనిచేయక స్థానికులతో పాటు ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధ్యాయులు వారి ఉద్యోగ రీత్యా ముఖ హాజరు తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కితలంగి పంచాయతీలోని కితలంగి, కోంతుగుడలలో ఏర్పాటు చేసిన టవర్ల ద్వారా సెల్ సిగ్నల్స్ అందడం లేదని, దీంతో నానా అవస్థలు ఎదుర్కొంటున్నామని వినియోగదారులు చెబుతున్నారు. అత్యవసర సమయాల్లో సమాచారం అందించేందుకు పడుతున్న పాట్లు వర్ణనాతీతమంటున్నారు. సెల్ సిగ్నల్ కోసం సమీపంలోని కొండపై వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. ఈ విషయమై కితలంగి పంచాయతీ సర్పంచ్ వరబోయిన సుబ్బారావు శనివారం అరకులోయలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు పునరుద్ధరించేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.


