విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు ఆహుతి
ములకలాపల్లిలో అగ్నిప్రమాదం
రూ. 25 లక్షల మేర ఆస్తి నష్టం
రూ.5 లక్షల నగదు, 8 తులాలబంగారు అభరణాలు అగ్నికి ఆహుతి
కట్టుబట్టలతో బాధితులు
దేవరాపల్లి : మండలంలోని ములకలాపల్లిలో ఓ ఇంటిలో గురువారం చోటుచేసుకున్న విద్యుత్ షార్టు సర్క్యూట్‌తో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన షేక్ ఈశ్వరమ్మ ఇంటిలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు రూ. 5 లక్షల నగదు, 8 తులాల మేర బంగారు అభరణాలు, వెండి అభరణాలు, సర్ధిఫికెట్లు, ఇంటిలో ఇతర సామాగ్రి సహా అగ్నికి ఆహుతయ్యాయి. వెరసి సుమారు రూ. 25 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడంతో భారీ ఆస్తి నష్టం జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. షేక్ ఈశ్వరమ్మ కుమారుడు అప్పాసాహెబ్ ఇటీవల మెగా డీఎస్సీలో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించారు. క్రిస్మస్ సెలవు కావడంతో అప్పాసాహెబ్ బుధవారం రాత్రి ఇంటికి వచ్చాడు. అదే ఇంటిలో ఉంటున్న తన బావ, అక్క కలిసి గురువారం మాంసం దుకాణం వద్దకు వెళ్లగా, అప్పాసాహెబ్ తన పిల్లలతో కలిసి చోడవరం వెళ్లారు. దీంతో అతని తల్లి ఇంటికి తాళం వేసి పొలం పనికి వెళ్లిపోయింది. ఎవరూ లేని సమయంలో ఈశ్వరమ్మ ఇంటి నుంచి దట్టమైన పొగలు వస్తుండడాన్ని స్థానికులు గమనించి కుటుంబ సభ్యులతో పాటు చోడవరం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలు అదుపు చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బాధిత కుటుంబ సభ్యులంతా ఇంటికి చేరుకొని చూడగా అప్పటికే ఇళ్లంతా కాలి బూడిదయ్యింది.
తిండిగింజలు సహా బూడిద...
ఇంటి అవసరాల నిమిత్తం బ్యాంక్‌లో కొంత బంగారం తాకట్టు పెట్టి తెచ్చిన రూ. 2 లక్షలు, తన మేనల్లుడు రఫీ వ్యాపారం నిమిత్తం అప్పుగా తెచ్చిన మరో రూ. 2 లక్షలు, తన తల్లి దాచుకున్న రూ. లక్ష నగదు, 8 తులాల బంగారం, వెండి అభరణాలు కాలిబూడిదయ్యాయని బాధిత ఉపాధ్యాయుడు కుటుంబ సభ్యులు భోరున విలపించారు. వీటితో పాటు సర్టిఫికెట్లు, ఆధార్, రేషన్ కార్డులు, గృహోపకరణాలు సహా తిండి గింజలు ఇతర సామగ్రి పూర్తిగా కలిబూడిద కావడంతో కట్టుబట్టలతో వారంతా రోడ్డున పడ్డారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో స్థానిక ఎస్‌ఐ వి.సత్యనారాయణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలను, ఆస్తి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి...
తన కుమారుడికి ఉపాధ్యాయ ఉద్యోగం రావడంతో తన కష్టాలు గట్టెక్కాయని ఆనందపడుతున్న తరుణంలో ఇళ్లు, ఇంటిలో ఆస్తి కాలి బూడిదవ్వడంతో బాధిత షేక్ ఈశ్వరమ్మ కన్నీటి పర్యంతమయ్యింది. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడిన తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరింది.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు ఆహుతి
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు ఆహుతి


