నిర్వాసితులకు న్యాయం చేయాలి
చింతూరు: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించడంతో పాటు పునరావాసం కల్పించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జాతీయ అధ్యక్షుడు దాట్ల నాగేశ్వరరావు అన్నారు. చింతూరులో ఏర్పాటుచేసిన పరిషత్ డివిజన్ కార్యాలయాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు పేరుతో ఆదివాసీలను ముంచుతున్న ప్రభుత్వాలు సరైన పరిహారం చెల్లించకుండా వారిని ఇక్కడి నుండి తరలించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. పూర్తిస్థాయిలో పరిహారం అందించిన అనంతరమే వారికి పునరావాస కేంద్రాలకు తరలించాలని, కాలనీల్లో అన్ని రకాల మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి చిన్నవీరభద్రం, నాయకులు వీరయ్య, శంకురమ్మ, అంజిరెడ్డి, లక్ష్మణరావు, నాగేశ్వరరావు, రాఘవయ్య, ప్రసాద్, ముత్తయ్య, కొండయ్య పాల్గొన్నారు.


