ఆసరాను కబళించిన మృత్యువు
పాలకాలవ మలుపు వద్ద రోడ్డు ప్రమాదం ఆగిఉన్న కారును ఢీకొన్న బైక్ ఇద్దరు పంచాయతీ కార్యదర్శులకు తీవ్ర గాయాలు రంపచోడవరం ఆస్పత్రిలో ఒకరు, రాజమహేంద్రవరం తరలిస్తుండగా మరొకరు మృతి ఆయా కుటుంబాల్లో తీరని విషాదం
రంపచోడవరం: రంపచోడవరం–గోకవరం మార్గంలోని పాలకాలవ మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. చింతూరు మండలం ఏడురాళ్లపల్లి పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న సందీప్ (34), పెద్దసీతనపల్లి పంచాయతీ కార్యదర్శి విద్యాసాగర్ (38) తమ విధులను ముగించుకుని గురువారం సెలవు కావడంతో సొంత ఊళ్లకు బయలుదేరారు. రాజోలు, పల్లంకురు ప్రాంతాల్లో ఉన్న తమ కుటుంబ సభ్యులతో గడపాలన్న ఉత్సాహంతో బైక్‌పై ప్రయాణమయ్యారు. అయితే, సాయంత్రం నాలుగు గంటల సమయంలో పాలకాలువ వద్ద ఆగి ఉన్న కారును ఢీకొట్టారు. ఇరువురికి రెండు కాళ్లు విరిగిపోయాయి. తలకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి నుంచి ఇద్దరిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. సందీప్ ఏరియా ఆస్పత్రిలో మృతి చెందగా, విద్యాసాగర్ మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ఆస్పత్రికి అంబులెన్సులో తరలిస్తుండగా గోకవరం సమీపంలో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆగి ఉన్న కారు రూపంలో వీరిని మృత్యువు కబళించింది.
పిడుగులా మరణవార్త
విద్యాసాగర్ ఇంటికి వస్తాడని ఎదురుచూస్తున్న భార్యాపిల్లలకు ఆయన మరణ వార్త పిడుగులా తగిలింది. ఇద్దరు పసిపిల్లలు ఇప్పుడు తండ్రి లేని అనాథలయ్యారు. మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం తరలిస్తుండగా అంబులెన్స్‌లోనే ఆయన ప్రాణాలు విడిచారు. మరో మృతుడు సందీప్‌కు వివాహం కాలేదు. తన తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తాడనుకుంటే, నూరేళ్ల నిండకుండానే తనువు చాలించడం ఆ ఊరిని కన్నీరు ముంచెత్తింది.
తోటి ఉద్యోగులు దిగ్భ్రాంతి
నిత్యం ప్రజల సమస్యల పరిష్కారంలో చురుగ్గా ఉండే ఇద్దరు యువ అధికారులు ఇలా అకస్మాత్తుగా మరణించడంతో తోటి ఉద్యోగులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒకరు ఆసుపత్రిలో, మరొకరు మార్గమధ్యలో మరణించడం విధి ఎంత క్రూరమైనదో చెబుతోంది. మలుపు వద్ద వేచి ఉన్న మృత్యువు, రెండు నిండు ప్రాణాలను బలితీసుకుని ఆ కుటుంబాలను కోలుకోలేని దెబ్బ తీసింది.
సందీప్, విద్యాసాగర్ మృతదేహాలు
వారు సామాన్యుల సేవలో నిమగ్నమైన ప్రభుత్వ వారధులు. సెలవు దొరికితే చాలు కన్నవారిని, కట్టుకున్నవారిని చూడాలనే ఆరాటంతో ఇళ్లకు బయలుదేరారు. కానీ, అదే వారి జీవితంలో చివరి ప్రయాణమవుతుందని ఎవరూ ఊహించలేదు. మార్గమధ్యలో ఆగి ఉన్న కారు రూపంలో మృత్యువు దారికాసి ఇద్దరిని కబళించింది. ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.
ఆసరాను కబళించిన మృత్యువు
ఆసరాను కబళించిన మృత్యువు


