సప్పర్ల ఘాట్‌లో నిలిచిన ఆర్టీసీ బస్సు
● ఇంజిన్‌లో సాంకేతిక లోపం
● పొగలు రావడంతో నిలిపివేసిన డ్రైవర్
● ఇబ్బందులు పడిన ప్రయాణికులు
సీలేరు: విశాఖ– భద్రాచలం అల్ట్రా డీలక్స్ బస్సు ఇంజిన్‌లో సాంకేతికలోపం తలెత్తడంతో బుధరవారం ఉదయం సప్పర్ల ఘాట్‌రోడ్డులో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విశాఖపట్నం నుంచి సీలేరు, చింతూరు మీదుగా భద్రాచలం వెళ్లాల్సిన ఈ బస్సు గూడెంకొత్తవీధి మండలం సప్పర్ల ఘాట్ రోడ్డు వద్దకు వచ్చేసరికి ఇంజన్‌లోంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో అపమ్రత్తమైన డ్రైవర్ బస్సును వెంటనే నిలిపివేశాడు. ఈ సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ధార కొండ ప్రాంతానికి చెందిన వారు కొంత మంది ద్విచక్రవాహనంపై వెళ్లిపోయారు. దీంతో ఆర్టీసీ అధికారులు నర్సీపట్నం డిపోకు చెందిన బస్సును రప్పించి సీలేరుకు చెందిన ప్రయాణికులను గమ్యానికి చేర్చారు. ఈ మధ్యకాలంలో అంతర్రాష్ట్ర రహదారి ఘాట్ రోడ్లో తరచూ విశాఖపట్నం డిపో చెందిన బస్సులు మొరాయిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి ఇబ్బందులు తలెత్తకుండా కండీషన్‌లో ఉన్న బస్సులను నడపాలని వారు కోరుతున్నారు.


