పాఠశాలలకు టీచర్లు డుమ్మా
మట్టిగూడ,చంపాపుట్టు బాలలు చదువులకు దూరం
ముంచంగిపుట్టు: ఎంటీఎస్ ఉపాధ్యాయులు తరచూ విధులకు డుమ్మా కొడుతుండడంతో మారుమూల గిరిజన విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు. మండలంలో రంగబయలు పంచాయతీ మట్టిగూడ ఎంపీపీఎస్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు సక్రమంగా విధులకు హాజరు కావడం లేదు. దీంతో భాషా వలంటీర్ పాఠశాలను నిర్వహిస్తున్నారు. సోమవారం ఇద్దరూ పాఠశాలకు రాకపోవడంతో 26 మంది విద్యార్థులకు స్థానిక గిరిజన యువకులే ఉపాధ్యాయులగా మారి చదువు చెప్పాల్సి వచ్చింది. ఇదే పంచాయతీ చంపాపుట్టు ఎంపీపీఎస్ పాఠశాలను కూడా భాషా వలంటీరే నిర్వహిస్తున్నారు. 36 మంది విద్యార్థులకు భాషా వలంటీర్ దిక్కుగా మారారు.ఎంపీఎస్ ఉపాధ్యాయుడు తనకు నచ్చినట్లు పాఠశాలకు వస్తున్నారు. వారంలో ఒకటి లేక రెండు రోజులు మాత్రమే వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని గ్రామస్తులు తెలిపారు. దీంతో విద్యార్థులకు సరైన విద్య అందని పరిస్థితి నెలకొంది.తక్షణమే విద్యాశాఖ అధికారులు స్పందించి ఉపాధ్యాయులు సక్రమంగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ ధనియాతో పాటు ఆయా గ్రామాల గిరిజనులు కోరుతున్నారు.దీనిపై మండల విద్యాశాఖాధికారి కృష్ణమూర్తిను వివరణ కోరగా మట్టిగూడ ఎంపీఎస్ టీచర్ సెలవు పెట్టారని, భాషా వలంటీర్ ఉదయం వెళ్లి మధ్యాహ్నం వచ్చేశారని చెప్పారు. చంపాపుట్టు టీచర్ నుంచి ఎటువంటి సమాచారం లేదని,మంగళవారం మట్టిగూడ,చంపాపుట్టు పాఠశాలకు వెళ్లి విచారణ చేసి,చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.


