సమయపాలన పాటించని బస్సులు.. తప్పని అవస్థలు
● ప్రయాణికుల ఫిర్యాదుతో స్పందించిన పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
● విశాఖపట్నం వెళ్లేందుకు ప్రత్యేక బస్సు ఏర్పాటుచేసిన వైనం
● హర్షం వ్యక్తం చేసిన గిరిజనులు
పాడేరు: పాడేరు ఆర్టీసీ డిపో నుంచి ఇతర ప్రాంతాలకు సమయానికి ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రాత్రి పాడేరు నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు చివరి బస్ ఏర్పాటు చేయకపోవడంతో పలువురు ప్రయాణికులు స్థానిక ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజుకు ఫోన్ ద్వారా విషయం తెలియజేశారు. దీంతో ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వెళ్లి ప్రయాణికులతో మాట్లాడారు. ఆదివారం విశాఖపట్నం, ఇతర ప్రాంతాల్లో టెట్ పరీక్షతో పాటు ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ పాఠశాలలకు సంబందించి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల కోసం పరీక్షా రాసేందుకు పలువురు ఉపాద్యాయులు, నిరుద్యోగులు బస్సుల్లో వెళ్లేందుకు వచ్చామని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఆయన ఆర్టీసీ డీఎం దృష్టికి తీసుకువెళ్ళి తక్షణమే ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయాలని చెప్పడంతో విశాఖపట్నం వెళ్లేందుకు బస్సును అందుబాటులో ఉంచారు. ఆర్టీసీ బస్సులు సమయపాలన పాటించి ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆర్టీసీ డీఎంకు సూచించారు.


