మన్యం సంతలు వెలవెల
సాధారణంగా పండగ సీజన్ వచ్చిందంటే మన్యం ప్రాంతంలోని వారపు సంతలు జనంతో కిక్కిరిసిపోవాలి. కానీ, ప్రస్తుత క్రిస్మస్ పండగ వేళ జిల్లాలోని ప్రధాన సంతలు కళతప్పుతున్నాయి. పండగ కొనుగోళ్ల కోసం ప్రజలు భారీగా వస్తారని ఆశించిన వ్యాపారులకు నిరాశే ఎదురవుతోంది. కొనుగోలుదారులు లేక సంతలన్నీ బోసిపోతున్నాయి. ఒకవైపు గిరిజన ఉత్పత్తుల ధరలు ఆశాజనకంగా లేకపోవడం, మరోవైపు నగదు కొరత లేదా ఇతర స్థానిక కారణాల వల్ల ఈ ఏడాది పండగ కళ కనిపించడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
● ఏదీ నాటి వైభవం
● అంతంతమాత్రంగానే వ్యాపారం
సాక్షి, పాడేరు: కొనుగోళ్లు లేక మన్యం సంతలు బోసిపోతున్నాయి. క్రిస్మస్ పండగకు ముందు దుస్తులు, కిరాణా, ఇతర వ్యాపారాలు భారీగా జరుగుతాయి. మైదాన ప్రాంతాలతోపాటు స్థానిక వ్యాపారులు ఇక్కడి సంతలపై ఆధారపడుతుంటారు. దీంతో ప్రతి సంతలో రూ.50 లక్షలకు పైగా లావాదేవీలు జరుగుతుంటాయి. గిరిజనులు కూడా ఈ సంతల్లోనే తమకు అవసరమైన సామగ్రి కొనుగోలు చేసుకుంటారు. పండగల సమయంలో ఇంటిల్లపాది సంతలకు వచ్చి నచ్చిన కొత్త దుస్తులు కొనుగోలు చేయడం పూర్వం నుంచి గిరిజనులకు సంప్రదాయం ఉంది. మన్యంలో క్రిస్మస్ పండగ జరుపుకునే గిరిజన కుటుంబాలు కూడా ఎక్కువగానే ఉన్నా వారపు సంతల్లో కొనుగోళ్లు మందగించాయి.
● పాడేరు మండలం గుత్తులపుట్టు వారపు సంతలో గురువారం కనీస వ్యాపారం లేక వస్త్ర, కిరాణా దుకాణదారులు ఆందోళన చెందారు.
● పాడేరు,అరకులోయలో శుక్రవారం జరిగిన వారపుసంతల్లో కొనుగోళ్లు నామమాత్రంగా జరిగాయి. జిల్లా కేంద్రమైన పాడేరులో వారపు సంతకు అన్ని మండలాల గిరిజనులు అధికంగానే తరలివస్తారు. అయితే ఈవారం క్రిస్మస్ పండగ సంతకు మాత్రం వచ్చిన గిరిజనుల సంఖ్య తక్కువగా కనిపించింది. మెయిన్‌రోడ్డు,సినిమాహాల్ సెంటర్ ప్రాంతాల్లోని రెడీమేడ్ వస్త్ర దుకాణాల వద్ద ఏ మాత్రం సందడి లేదు. కిరాణా, కూరగాయల దుకాణాల వద్ద అదే పరిస్థితి నెలకొంది.
● ఈ సీజన్‌లో దిగుబడికి వచ్చే కాఫీ, రాజ్‌మా గింజల అమ్మకాలు జరగక గిరిజనుల వద్ద ఆదాయం కరువైంది. జీసీసీ కాఫీ గింజల కొనుగోలు ధర కిలో రూ.450 నిర్ణయించినప్పటికీ తేమశాతం అధికంగా ఉందన్న నెపంతో కొనుగోళ్లకు దూరంగానే ఉంది. ప్రైవేట్ వ్యాపారులు కిలో రూ.320 ధర నిర్ణయించడంతో తక్కువ ధరకు గిరిజనులు అమ్ముకోలేకపోతున్నారు.
● రాజ్‌మా విషయానికి వస్తే ఈఏడాది దిగుబడులు ఆలస్యమవ్వడంతో గిరిజన రైతులు అమ్మకాలు చేపట్టలేకపోతున్నారు. రాజ్‌మా చిక్కుళ్ల గింజలు వస్తున్నప్పటికి కిలో రూ.80 తక్కువ ధరతో వ్యాపారులు కొనుగోలు ప్రారంభించారు. గిరిజన రైతులు ఉసూరుమంటున్నారు. ఈ పరిస్థితుల్లో గిరిజన రైతు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి.
మన్యం సంతలు వెలవెల


