
సమీక్ష సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నహోం మంత్రి అనిత
స్వయంగా ప్రస్తావించిన హోం మంత్రి
సమీక్ష సమావేశంలో వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ
తమను నిందించడంపై అధికారుల అభ్యంతరం
అక్రమాల్లో అగ్రభాగం కార్యకర్తలదేనని గుసగుసలు
నియోజకవర్గంలో అవినీతి రాజ్యమేలుతోంది. ప్రతి పనికి ఒక రేటు పెట్టేశారు. ఏం జరుగుతుందో నాకు తెలియదనుకుంటున్నారా? అధికారుల అవినీతి అడ్డూ అదుపు లేకుండా పోతోంది.. అంటూ స్వయానా హోం మంత్రి వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలోనే కాదు.. జిల్లాలోనే చర్చనీయాంశమయ్యాయి. గురువారం నక్కపల్లి వెలుగు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంలో హోం మంత్రి అధికారులనుద్దేశించి ఈ మాటలు అన్నారు. అక్రమాల్లో అగ్రభాగం కూటమి పార్టీల కార్యకర్తలదేనని, అదేమీ పట్టించుకోకుండా తమను తప్పు పట్టడంపై కొందరు మనస్తాపం చెందారు. మంత్రి అనుయాయుల అండ ఉండగా మనకేమిటని మరికొందరు ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారు.
నక్కపల్లి: ‘రెవెన్యూ, ట్రాన్స్‌కో, ఇరిగేషన్ శాఖలలో అవినీతి విపరీతంగా జరుగుతోంది. సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఏ పని చేయాలన్నా ఒక రేటు పెట్టేశారు. బ్రోకర్ల ద్వారానే పనులు జరుగుతున్నాయం’టూ చాలామంది తనకు ఫిర్యాదు చేస్తున్నారని ఆమె అధికారులపై విరుచుకుపడ్డారు. నిఘా వర్గాల ద్వారా నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ప్రతి రోజు తెలుసుకుంటున్నానని, పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. అయితే మంత్రి ఇలాకాలోనే అవినీతి మూలాలున్నాయని.. కూటమి నాయకులు, ఆమె అనుచరుల నుంచే ఈ జాడ్యం మొదలయ్యిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చిట్టా విప్పితే బాగోతాలెన్నో..
వారు పేరు చెప్పి వీరు, వీరి పేరు చెప్పి వారు యథేచ్ఛగా దోచుకుంటున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతి రాజ్యమేలుతోంది. ఇవన్నీ బహిరంగ రహస్యమే అయినా సమావేశాల్లో విమర్శలు చేయడం ఎవరిని మభ్యపెట్టడానికి అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
●పట్టాదారు పాసు పుస్తకాల కోసం, ఆన్‌లైన్‌లో నమోదు కోసం వేలాది రూపాయలు గుంజుతున్నారు. తీరప్రాంతాల నుంచి సముద్రపు ఇసుక, కొండల నుంచి అక్రమంగా గ్రావెల్ తవ్వేసి తరలించేస్తున్నారు. రెవెన్యూ కార్యాలయాల్లో అయితే ప్రజలు నేరుగా వెళ్లి అధికారులను కలిసే అవకాశం ఉండటం లేదు. కూటమి కార్యకర్తలే బ్రోకర్ల అవతారమెత్తి అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. గ్రామాల్లో చోటా మోటా కార్యకర్తలు.. మీకు గృవహాలు మంజూరు చేయిస్తాం, నిర్మాణంలో ఉన్న ఇళ్లకు బిల్లులు మంజూరు చేయిస్తామంటూ వేలాది రూపాయలు ముందుగానే గుంజుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి స్థలాల కోసం అర్జీలు స్వీకరించడంతోపాటు కొంత మొత్తాన్ని కూడా వసూలు చేస్తున్నారు.
●ఎకై ్సజ్ శాఖలో అయితే అవినీతి తారస్థాయికి చేరుకుంది. గ్రామాల్లో ఇష్టానుసారం బెల్టు షాపులు ఏర్పాటు చేశారు. ఎంఆర్‌పీ కంటే రూ.50లు అధికంగా వసూలు చేస్తున్నారు. షాపుల్లో లూజు అమ్మకాలు చేయరాదని నిబంధనలు ఉన్నప్పటికీ యథేచ్ఛగా జరుగుతోంది. దీని వల్ల మద్యం కల్తీ జరుగుతోందంటూ మందుబాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లైసెన్స్ కలిగిన దుకాణ యజమానుల ప్రోత్సాహంతోనే విచ్చలవిడిగా బెల్టు షాపులు ఏర్పాటవుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. అయితే ప్రభుత్వ పెద్ద ఒకరికి ఏటా మద్యం సిండికేట్ల నుంచి లక్షలాది రూపాయలు మామూళ్లు ఇస్తున్నామని, దాన్ని కవర్ చేసుకోవాలంటే బెల్టుషాపులు, ఎంఆర్‌పి కంటే అధిక ధరలకు విక్రయించక తప్పదని సిండికేట్లు చెబుతున్నారు.
●ట్రాన్స్‌కో సిబ్బంది అయితే వేరే చెప్పక్కర్లేదు, మీటరు కోసం, వ్యవసాయ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటూ నెలల తరబడి కార్యాలయాల చుట్టు తిరగాల్సిందే. వేలాది రూపాయలు మామూళ్లు ఇస్తేనే గాని పనులు జరగడం లేదు.
●అనధికార లేఅవుట్లు వేస్తూ ప్రభుత్వానికి చెందిన పంట కాలువలను, గెడ్డలను ఆక్రమిస్తున్నారు. వాటి మీద అనుమతులు తలేకుండా కల్వర్టులు నిర్మించి రాచమార్గాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని అరికట్టాల్సిన అధికారులు మామూళ్లకు కక్కుర్తిపడి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇరిగేషన్ శాఖలో కూడా అవినీతి రాజ్యమేలుతోంది.
ఇలాంటివి ‘మామూలే’..
మంత్రి అనుయాయులు, కూటమి పార్టీల నాయకులే ఈ జాడ్యానికి కారణం.. మనల్ని ఒక్కర్నే నిందిస్తే ఎలా.. ఇలాంటివి మామూలే అని అధికారులు లైట్ తీసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. కూటమి కార్యకర్తల్లో అవినీతిని ముందు అరికడితే తర్వాత అధికారుల్లో మార్పు వస్తుందన్న అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.