
ఎమ్మెల్యేల సమావేశ ప్రాంగణంలోనే కొట్లాట
డిప్యూటీ సీఎం పవన్ ప్రొటోకాల్ చైర్మన్‌కు దేహశుద్ధి
రూ.25 లక్షలకే ఫ్లాట్లు ఇస్తానని వసూలు
వాటిని వేరొకరికి రిజిస్ట్రేషన్
ఒక ఎమ్మెల్యే అనుచరుడి నుంచి చేబదులుగా రూ.40 లక్షలు
డబ్బు ఇవ్వకుండా తిరుగుతున్న తిరుమలరావు
జనసేన సమావేశ మందిరంలో అతడిని చితకబాదిన బాధితుడు
విశాఖ సిటీ: జనసైనికుల మధ్య జరిగిన ముష్టి యుద్ధం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశ సమయంలోనే ఇద్దరు జన సైనికులు పిడుగుద్దులు కురిపించుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. జనసేనాని పవన్ ప్రొటోకాల్ చైర్మన్‌పైనే తీవ్ర ఆరోపణలు ఆ పార్టీలో సెగలు పుట్టిస్తున్నాయి. తక్కువ ధరకే ఫ్లాట్ల విక్రయాల పేరుతో డబ్బు వసూలు చేసి వాటిని ఎక్కువ ధరకు వేరొకరికి అమ్మి సొమ్ముచేసుకున్నాడని పవన్ సన్నిహితుడిని సమావేశంలోనే చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని గురువారం బీచ్ రోడ్డులోని వైఎంసీఏ పక్కన ఉన్న ఒక హోటల్‌లో నిర్వహించారు.
దీనికి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సమావేశం జరిగే హోటల్‌లోనే పవన్‌కల్యాణ్ ప్రొటోకాల్ చైర్మన్ మల్లినేడి తిరుమలరావు, కాకినాడ జిల్లాకు చెందిన జనసేన ఎమ్మెల్యే అనుచరుడు ప్రసాద్ మధ్య తీవ్ర స్థాయిలో కొట్లాట జరిగినట్లు సమాచారం.
రూ.కోట్లకు కుచ్చుటోపి
గత ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్రకు ప్రొటోకాల్ చైర్మన్‌గా బిల్డర్ అయిన మల్లినేడి తిరుమలరావు అలియాస్ బాబీకి బాధ్యతలు అప్పగించారు. ఆ యాత్ర తర్వాత అతడి పదవి, హోదాపై స్పష్టత లేనప్పటికీ.. ఇప్పటికీ పవన్ పర్యటన బాధ్యతలు తానే చూసుకుంటున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. వృత్తిరీత్యా బిల్డర్ అయిన తిరుమలరావు భీమవరంలో వెంకటసాయి బిల్డర్స్ పేరుతో భారీ అపార్ట్‌మెంట్ నిర్మించి అనేక మందిని మోసం చేసినట్లు బాధితులు ఇప్పటికే కోర్టులో కేసులు సైతం వేశారు. అపార్ట్‌మెంట్ నిర్మాణ సమయంలో ఒకేసారి క్యాష్ ఇస్తే రూ.25 లక్షలకే ఫ్లాట్ ఇస్తానని చెప్పి అనేక మంది నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఇలా డబ్బు తీసుకున్న వారికి కాకుండా నిర్మాణం పూర్తయిన తర్వాత ఫ్లాట్లను అధిక ధరకు విక్రయించినట్లు చెబుతున్నారు. దీనిపై రూ.25 లక్షలు ఇచ్చిన వారు తిరుమలరావును ఏళ్లుగా అడుగుతున్నప్పటికీ.. పవన్ కల్యాణ్‌కు ఫండింగ్ చేశానని, ఆ డబ్బులు తిరిగి వచ్చిన వెంటనే ఇచ్చేస్తానని ఒకసారి, ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారికి బినామీని అని త్వరలోనే అందరికీ ఇచ్చేస్తానని మరోసారి చెబుతూ తప్పించుకుని తిరుగుతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కాకినాడ జిల్లాకు చెందిన జనసేన ఎమ్మెల్యే అనుచరుడు ప్రసాద్ అనే వ్యక్తి నుంచి చేబదులు కింద రూ.40 లక్షలు తీసుకుని రెండేళ్లుగా ఇవ్వకుండా తిప్పుతున్నట్లు సమాచారం.
సమావేశంలో చితక్కొట్టిన బాధితుడు
జనసేన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పవన్ కల్యాణ్ ప్రొటోకాల్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న తిరుమలరావును జనసేన ఎమ్మెల్యే అనుచరుడు ప్రసాద్ పట్టుకున్నాడు. తన డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుని తిరగడంపై నిలదీశాడు. వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తిరుమలరావును కోపంతో చితక్కొట్టేశాడు. ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల సమక్షంలో తీవ్ర స్థాయిలో కొట్లాట జరిగింది. అందులో చాలా మంది తిరుమలరావు వ్యవహారం తెలియడంతో వారు కల్పించుకోలేదు. కొంతమంది మాత్రం వ్యక్తిగత వ్యవహారాలు బయట చూసుకోవాలని సమావేశంలో కాదని వారిని వారించే ప్రయత్నం చేశారు. దీనిపై ప్రసాద్ మండిపడుతూ పవన్ కల్యాణ్‌కు ప్రొటోకాల్ చైర్మన్ అని చెప్పుకుంటున్న తిరుమలరావు పార్టీ సభ్యుడు కాదా? అని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసిన వ్యక్తికి కీలకమైన బాధ్యతలు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించడంగా ఎవరూ నోరెత్తలేకపోయారు. ప్రసాద్ తనను తీవ్రంగా కొట్టినట్లు తిరుమలరావు మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినట్లు సమాచారం. అయితే తిరుమలరావు వ్యవహార శైలి తెలిసిన ఎమ్మెల్యేలు ఆ కేసు తీసుకోవద్దని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్లాలని బాధితులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే తిరుమలరావు వ్యవహారం పవన్‌కు తెలిసినప్పటికీ.. ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వారు వాపోతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.