
‘ఉపాధి’లో అంతులేని అవినీతి
రాజవొమ్మంగి: మండలంలో 2024–25 ఏడాదిలో జరిగిన రూ. 20 కోట్ల విలువైన 2,148 పనులపై మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదిక(సోషల్ ఆడిట్) జరిగింది. మండలంలోని 19 పంచాయతీలకు గాను రాత్రి 8 గంటల వరకు 11 పంచాయతీల ఆడిట్ మాత్రమే పూర్తి కాగా.. ఆడిట్‌కు హాజరైన డ్వామా పీడీ డాక్టర్ విద్యాసాగర్ వివరాలు తెలియజేశారు. మండలంలోని లాగరాయి, లబ్బర్తి, కిండ్ర గ్రామాల్లో రూ.లక్షలాది విలువ చేసే చెరువు తవ్వకం పనులు యంత్రాలతో జరిగినట్లు గుర్తించామన్నారు. ఇందులో భాగస్వామ్యం ఉన్న సిబ్బంది అందరిపై చర్యలు తీసుకోవడంతో పాటు నిధులు రికవరీ చేస్తామని సభాముఖంగా వెల్లడించారు. ఒకే ఇంట్లో మూడు నుంచి నాలుగు జాబ్‌కార్డులు మంజూరు చేయడం కూడా గుర్తించామన్నారు. అనర్హులను గుర్తించి వారి నుంచి మొత్తం వేతనం రికవరీ చేస్తామన్నారు. ఇందుకు బాధ్యులైన ముగ్గురు ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇద్దరు బీఎఫ్‌కేలను, ఈసీను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. అవకతవకలకు సంబంధించి సుమారు రూ.6 లక్షలు రికవరీకి ఆదేశించామన్నారు. కొన్ని పనులు తిరిగి చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఒక అంగన్‌వాడీ కారకర్త సామాజిక పింఛను పొందుతున్నట్లు తనిఖీల్లో తేలిందన్నారు.
అంతా గందరగోళం
ఇదిలా ఉండగా ఉపాధి హామీ సోషల్ ఆడిట్ ఆద్యంతం గందరగోళంగా సాగింది. ఓ రిజర్వాయర్‌లో పెర్యూలేషన్ ట్యాంకు(చెరువులో చెరువు) తవ్వినట్లు వెలుగు చూడడంతో ఆడిట్‌కు వచ్చిన పీడీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జిల్లాలో ఈ మాదిరిగా ఎక్కడా అవకతవకలు చూడలేదని పీడీ అన్నారు. ఫారమ్ పాండ్స్ తవ్వకాల్లో, ల్యాండ్ డెవలప్‌మెంట్(నేల చదును) పనుల్లో భారీగా కొలతల్లో వ్యత్యాసం కనుగొన్నారు. మట్టి పనుల రేట్లు తేడాగా వేసినట్లు గుర్తించారు. ఉపాధి సామాజిక తనిఖీ జరుగుతున్న సమయంలో అధికారులు వెల్లడించిన పలు అవకతవకలపై ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకే ఇంట్లో రెండు జాబ్‌కార్డులు ఉండకూడదా, నిరుద్యోగులు ఉపాధి పనులకు వెళ్లకూడదా, అటువంటి అభాగ్యుల నుంచి వేతనాలను తిరిగి రికవరీ చేస్తారా? అంటూ ఆదివాసీ సంఘం నాయకులు వంతు బాలకృష్ణ, జగన్నాథం, తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి పీడీ సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఎంపీపీ గోము వెంకటలక్ష్మి. పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఏపీడీ రాంబాబు, హెచ్‌ఆర్ మేనేజర్ ఈశ్వర్రావు, ఏపీఈ బాలాజిదాస్, ఎస్టీఎం గౌరీ శంకర్, ఎస్‌ఆర్పీ అచ్యుతరావు పాల్గొన్నారు.
యంత్రాలతో పనులు.. కొలతల్లో
భారీ తేడాలు
పలువురు సిబ్బంది సస్పెన్షన్ ..
నిధుల రికవరీ
2024–25 ఏడాదిలో రాజవొమ్మంగి మండలంలో అవకతవకలు
సోషల్ ఆడిట్‌లో బట్టబయలు