
చదువుతోనే అజ్ఞానం దూరం
● ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్
జల్లిపల్లి సుభద్ర
● కర్రిముఖిపుట్టు జెడ్పీ హైస్కూల్ తనిఖీ
ముంచంగిపుట్టు: చదువుతోనే అజ్ఞానం దూరమని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. మండలంలోని కర్రిముఖిపుట్టులోని జెడ్పీ హైస్కూల్‌ను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. పాఠశాల విద్యాకమిటీ సభ్యులు,ఉపాధ్యాయులతో మాట్లాడా పాఠశాలలో సమస్యలను తెలుసుకున్నారు. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు 192 మంది విద్యార్థులు ఉన్నారని, పాఠశాల నిర్వహణకు వసతి సమస్య ఎక్కువగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు చైర్‌పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు.తాత్కాలిక రేకుల షెడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. అనంతరం ఆమె తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. పలు ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయులు చెప్పే ప్రతి అంశాన్ని అర్థం చేసుకుంటూ చదువుకోవాలని సూచించారు. అన్ని సబ్జెక్టుల్లో పట్టు సాధించాలని, ముఖ్యంగా పేదరికం జయించాలంటే చదువునే ఆయుధంగా వినియోగించుకోవాలన్నారు. తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను అర్థం చేసుకొని గిరిజన విద్యార్థులు బాగా చదువుకోవాలని,ఉన్నత స్థాయికి ఎదిగి, గ్రామానికి, మండలాలనికి మంచి పేరు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం కర్రిముఖిపుట్టుకు జెడ్పీ స్కూల్ రావడానికి కృషి చేసిన జెడ్పీ చైర్ పర్సన్‌కు ఉపాధ్యాయులు, కర్రిముఖిపుట్టు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సత్కరించారు. ఎంపీడీవో సూర్యనారాయణమూర్తి, ఎంఈవో కృష్ణమూర్తి, సర్పంచ్ పుల్‌మొత్తి, సుజనకోట ఎంపీటీసీ సుబ్బలక్ష్మి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షులు పద్మారావు, ప్రధాన కార్యదర్శి రాంప్రసాద్ పాల్గొన్నారు.