
వైఎస్సార్‌సీపీ మరింత బలోపేతమే లక్ష్యం
● ఆ దిశగా మండల బూత్ కమిటీల ఏర్పాటు
● అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
డుంబ్రిగుడ: వైఎస్సార్‌సీపీ మరింత బలోపేతమే లక్ష్యంగా పని చేస్తున్నట్టు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు. నియోజకవర్గం అరకులోయ కేంద్రంలో తన క్యాంపు కార్యాలయంలో పార్టీ డుంబ్రిగుడ మండల నాయకులతో మంగళవారం జరిగిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ లక్ష్యాలు, బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అరకు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అన్ని విభాగాలు, అనుబంధ సంఘాలకు కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పార్టీ కోసం చిత్తశుద్ధితో కష్టపడి పనిచేసిన వారికి, చదువుకున్న యువతకు కమిటీల్లో ప్రాధాన్యత ఇస్తామన్నారు. గ్రామ స్థాయి నుంచే సమర్థులైన వారిని ఎంపిక చేయాలన్నారు. ఈ నెల 25వ తేదీలోపు బూత్ కమిటీల ఎంపికను పూర్తి చేయాలన్నారు. కమిటీల్లో స్థానం పొందిన ప్రతి ఒక్కరూ పార్టీ కోసం అంకిత భావం, నిజాయితీతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ డుంబ్రిగుడ మండల అధ్యక్షుడు పాంగి పరశురామ్, డుంబ్రిగుడ వైస్ ఎంపీపీ శెట్టి ఆనంద్, ఉమ్మడి జిల్లాల ఎస్‌టీ కమిటీ మాజీ అధ్యక్షుడు కమ్మిడి ఆశోక్, నాయకులు బాకా సింహాచలం, బురిడి మోహస్, బబీత ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.