రికార్డు స్థాయిలో కురిసిన వర్షం
ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, గెడ్డలు
హుకుంపేట: బొడ్డాపుట్టులో ఖరీఫ్ పంట భూముల మీదుగా ప్రవహిస్తున్న వరద నీరు
డుంబ్రిగుడ: ఎస్‌ఐ చొరవతో మృతదేహాన్ని గెడ్డ దాటించి స్వగ్రామం తరలిస్తున్న బంధువులు
సాక్షి, పాడేరు: జిల్లావ్యాప్తంగా రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానతో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో జిల్లాలోని ప్రధాన గెడ్డలు, వాగుల్లో వరద ఉధృతి నెలకొంది. పాడేరు–హుకుంపేట సరిహద్దులోని దిగుమోదాపుట్టు గెడ్డను దాటుతూ అడ్డుమండ గ్రామానికి చెందిన కుమారస్వామి అనే గిరిజనుడు ఆదివారం సాయంత్రం గల్లంతయ్యాడు. జి.మాడుగుల, పాడేరు, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో విస్తరించిన మత్స్యగెడ్డలో వరద నీరు అధికమై పరదానిపుట్టు కాజ్‌వే మీదుగా ప్రవహిస్తుంది. పాడేరు, పెదబయలు మండలాల్లోని సుమారు 100 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. మారుమూల గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. చింతూరు డివిజన్‌లో అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో సోకిలేరుతోపాటు అనేక గెడ్డలలో వరద ఉధృతి నెలకొంది. చింతూరు నుంచి వి.ఆర్.పురం, కూనవరం మండలాలకు రవాణా స్తంభించింది. అలాగే ఎగువ నుంచి వచ్చే వరద నీరుతో శబరి, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదల పరిస్థితిపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాలతో లోతట్టు వ్యవసాయ భూములు చెరువులుగా మారాయి. ఇటీవల వేసిన వరినాట్లు చాలా ప్రాంతాల్లో కొట్టుకుపోవడంతో గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. పాడేరు, పెదబయలు, ముంచంగిపుట్టు, హుకుంపేట, జి.మాడుగుల, చింతపల్లి మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉంది. వర్షాలు, వరదల కారణంగా పర్యాటక కేంద్రం చాపరాయిని మూసివేశారు.
చింతూరు డివిజన్‌లో నిలిచిన రాకపోకలు గోదావరి, శబరి నదుల్లోనూ వరద ఉధృతి ప్రమాదకరంగా మత్స్యగెడ్డ లోతట్టు భూముల్లో వరిపంట మునక దిగుమోదాపుట్టు గెడ్డ దాటుతూ గిరిజనుడు గల్లంతు పాడేరు మండలంలో అత్యధిక వర్షపాతం
మృతదేహంతో గెడ్డ దాటలేక..
డుంబ్రిగుడ: అరకులోయ ఏరియా ఆస్పత్రిలో సోమవారం అనారోగ్యంతో మృతి చెందిన పోంతంగి పంచాయతీ చంపపట్టి గ్రామానికి చెందిన కిల్లో మల్లేష్ (18) మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు బంధువులు అష్టకష్టాలు పడ్డారు. స్వగ్రామానికి తీసుకువెళ్లాలంటే అడ్డంగా గెడ్డ పొంగి ప్రవహిస్తుండటంతో ఎస్‌ఐ కె.పాపినాయుడు చొరవ తీసుకొని పోలీసు సిబ్బందితో కుసుమగుడ, కితలంగి వెళ్లే వంతెన వద్ద మృతదేహాన్ని గెడ్డ దాటించి కుటుంబానికి అప్పగించారు.
దిగువ కొల్లాపుట్టులో జలపాతం వద్ద గెడ్డ ఉధృతికి జెట్టి లక్షణ్ ఆటో కొట్టుకుపోవడాన్ని గమనించిన స్ధానికులు తాడు సహాయంతో ఒడ్డుకు లాగారు.
సీలేరు: భారీ వర్షాలకు పెద్ద గంగవరం తురలు వంతెన పైనుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో విశాఖపట్నం నుంచి సీలేరు మీదుగా భద్రాచలం వెళ్లాల్సిన బస్సులను దారి మళ్లించి, కేడీ పేట మీదుగా నడిపారు. గూడెం మండల కేంద్రం నుంచి సీలేరు మీదుగా పాలగెడ్డ వరకు ఉన్న 80 కిలోమీటర్ల రహదారి గోతుల్లో వర్షం నీరు చేరి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. డొంకరాయి రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. గుమ్మురేవులు పంచాయతీ మారుమూల కొన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిందని గిరిజనులు తెలిపారు.
మన్యంలో ప్రమాద ఘంటికలు
మన్యంలో ప్రమాద ఘంటికలు