
రూ.500 కోట్లతో ఆధునికీకరణ ఒప్పందాలు
ముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో చుట్టూ ఎత్తయిన కొండలు, జాలు వారే జలపాతాలు, ఆకట్టుకునే ప్రకృతి సోయగాల మధ్య తళుక్కున మెరిసే విద్యుత్ కాంతి రేఖ.. మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రారంభమైన మొదటి విద్యుత్ కేంద్రం ఇది. 70 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ ప్రాజెక్టుకు 1931లోనే బీజం పడింది. అప్పటి బ్రిటిషు శాస్త్రవేత్త హెన్రీ హెవర్టు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్న సమయంలో మాచ్‌ఖండ్ జల విద్యుత్కేంద్రం నిర్మాణం కోసం రిపోర్టును తయారు చేయించారు. 1941 నుంచి 1943 వరకు సర్వేలు చేసి అనుకూలమైన ప్రదేశాన్ని గుర్తించారు. 1946లో విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను రూ.18 కోట్లతో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తర్వాత ఈ విద్యుత్ కేంద్రం ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాల సంయుక్త ప్రాజెక్టుగా అమల్లోకి వచ్చింది. ఈ జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో ఆంధ్రకు 70 శాతం, ఒడిశాకు 30 శాతం చొప్పున వినియోగించుకోవాలని రెండు రాష్టాలు నిర్ణయించుకున్నాయి. 7 సంవత్సరాల క్రితం 50ః50 చొప్పున ఇరు రాష్టాలు సమానంగా వినియోగించుకోవాలని ఒప్పందాన్ని సవరించారు.
డుడుమ, జోలాపుట్టు జలాశయాల మీదే ఆధారం..
మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో ఇరు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న డుడుమ, జోలాపుట్టు జలా శయాల పైన ఆధారపడి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. డుడుమ జలాశయ నీటి సామర్ధ్యం 2590 అడుగులు, జోలాపుట్టు జలాశయ నీటి సామర్ధ్యం 2750 అడుగులు. ఈ రెండు జలాశయాలకు మత్స్యగెడ్డ నీరే దిక్కు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నీటిని ఏడాది పొడవునా 2 జలాశయాల్లో నిలువ ఉంచుతారు.
మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి ఘనమైన చరిత్ర స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ప్రారంభమైన మొదటి విద్యుత్ కేంద్రం ఆధునికీకరిస్తే మరింత ఉత్పత్తికి ఆస్కారం నేడు మాచ్‌ఖండ్ ప్రాజెక్టు ఆవిర్భావ దినోత్సవం
ఈ ప్రాజెక్టును ఆధునికీకరించాలని ఇరు రాష్ట్రాలు 2012లో ఒప్పందం కుదుర్చుకున్నాయి. రూ.500 కోట్లు వ్యయమయ్యే ఆధునికీకరణకు సంబంధించి నివేదిక తయారు చేసే బాధ్యతను టాటా కన్సల్టెన్సీ కంపెనీకి ఏపీ జెన్‌కో వర్గాలు అప్పగించాయి. ఈ కంపెనీ బృందం అధ్యయనం చేసి నివేదికను ఆంధ్ర–ఒడిశా ప్రభుత్వాలకు రెండేళ్ర క్రితం అందజేసింది. ఆధునికీకరణ జరిగితే ప్రస్తుతం 120 మెగావాట్లుగా ఉన్న విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 150 మెగావాట్లకు పెరిగే ఆస్కారం ఉంది.

రూ.500 కోట్లతో ఆధునికీకరణ ఒప్పందాలు