
సురక్షిత ప్రాంతాల్లోనే ఉండండి
అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి
సాక్షి, పాడేరు: భారీ వర్షాలు, వరదల సమయంలో అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అరకు పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ గుమ్మా తనూజరాణి కోరారు. పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న ఎంపీ సోమవారం ప్రకటన విడుదల చేశారు. వర్షాలతో కొండవాగులు, గెడ్డలు ప్రమాదకరంగా ప్రవహిస్తుండడంతో ఆయా పరివాహక ప్రాంతాల ప్రజలంతా గెడ్డలు దాటి ప్రయాణాలను మానుకోవాలని, సురక్షిత ప్రాంతాలకే పరిమితమవ్వాలని ఆమె సూచించారు. ప్రమాదకరంగా వరద నీరు ప్రవహించే కల్వర్టులు, కాజ్‌వేలపై వాహనాల రాకపోకలను అధికారులు నియంత్రించాలని, వైద్యసేవలకు అంతరాయం లేకుండా వైద్యబృందాలు పనిచేయాలని, అన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సహాయక కార్యక్రమాల కోసం అల్లూరి జిల్లా కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారని, ఎలాంటి ఇబ్బందులున్నా ప్రజలు 08935293448 నంబర్‌కు ఫోన్ చేసి తగిన సాయం పొందాలన్నారు. ప్రజలు అత్యవసర సమయంలో 9966633304, 9494995333, 9494414619 నంబర్లకు ఫోన్ చేసి తన కార్యాలయం వారిని సంప్రదించవచ్చన్నారు.