
25 నాటికి బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం
ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
అరకులోయ టౌన్: అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో ఈనెల 25వ తేదీ నాటికి బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్‌ఏ) నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ మండల అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ప్రత్యేక శ్రద్ధతో బీఎల్‌ఏల నియామకం పూర్తి చేయాలన్నారు. ప్రతి బూత్ లెవెల్‌కు ఇద్దరు ఏజెంట్లను నియమించాలన్నారు. ఉన్నత చదువులు చదివిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో దేశవ్యాప్తంగా ఓటర్ల సవరణ కార్యక్రమం చేపట్టనున్న నేపఽథ్యంలో బీఎల్‌ఏల నియామకం త్వరితగతిన చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. బీఎల్‌ఏలు వారి పోలింగ్ బూత్ పరిధిలో కొత్తగా ఓటర్లను చేర్పించుకునేందుకు, దొంగ ఓట్లు ఉన్నట్లయితే తొలగింపు కోసం అభ్యంతరాలు నమోదు చేసేందుకు, అలాగే వైఎస్సార్‌సీపీకి చెందిన వారి పేరు తొలగించినట్లయితే అటువంటి వివరాలను బూత్ లెవెల్ అధికారి దృష్టికి తీసుకువెళ్లి ఓటర్ల జాబితాలో తిరిగి నమోదు చేసేందుకు కృషి చేయాలన్నారు. ఇటీవల పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలను వైఎస్సార్‌సీపీ నాయకులకు తెలియకుండానే కూటమి ప్రభుత్వ పెద్దలు మార్చేశారన్నారు. అందువల్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు నియోజకవర్గం పరిధిలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సూచించారు. ఈ నెల 18, 19వ తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. గెడ్డలు, వాగులు దాటవద్దన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పా ఇంటి నుంచి బయటకు రావద్దన్నారు. ప్రభుత్వ అధికారులతో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజలకు సేవలందించాలని పిలుపు నిచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112, 108 నంబర్‌తో పాటు 93815 58327, 63042 34889 నంబర్‌లకు సంప్రదించాలన్నారు.