
గంజాయి సాగు నిర్మూలనపై దృష్టి
జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ
పాడేరు: జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు చేయకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిర్మూలన చర్యలు చేపట్టాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ ఆదేశించారు. ఐటీడీఏలోని తన చాంబర్‌లో సోమవారం అటవీ, వ్యవసాయ, ఉద్యానవన శాఖలు, డీఆర్డీఏ, ఐసీడీఎస్, ఎస్‌ఎంఐ అధికారులతో గంజాయి నిర్మూలన కార్యక్రమంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అటవీ హక్కు పత్రాలు పంపిణీ చేసిన సాగు భూముల్లో గంజాయి సాగు చేయకుండా ఎలాంటి పర్యవేక్షణ చేపడుతున్నారని అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెక్‌పోస్టుల వద్ద గంజాయి రవాణా జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. గ్రామైక్య సంఘాల సమావేశాల్లో గంజాయి నిర్మూలనపై చర్చించాలన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలను పంపిణీ చేయాలన్నారు. గంజాయి సాగు జరగకుండా పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎన్‌బీఎస్ నంద్, డీఆర్డీఏ పీడీ మురళి, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీలక్ష్మి, ఎస్‌ఎంఐ డీఈ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.