
వైఎస్సార్‌సీపీ మరింత బలోపేతమే లక్ష్యం
పాడేరు: నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని ప్రతి గ్రామంలో వైఎస్సార్‌సీపీను మరింత బలోపేతం చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందేలా పనిచేయాలని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు అన్నారు. సోమవారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఇటీవల వైఎస్సార్‌సీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమితులైన చింతపల్లి జెడ్పీటీసీ పోరురాజు బాలయ్య పడాల్, వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన జీకే వీధికి చెందిన బొబ్బిలి లక్ష్మణ్, వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన చింతపల్లికి చెందిన జల్లి సుధాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర స్థాయిలో పార్టీ పదవులు ఇవ్వడంపై వారు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ దుశ్శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. నియోజకవర్గంలో పార్టీని అన్ని వర్గాలతో కలుపుకుంటూ మరింత బలోపేతం చేయాలని, పార్టీ పిలునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా కృషి చేయాలని ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు వారికి సూచించారు.