
రక్త ‘పరీక్ష’లే..!
మహారాణిపేట: ఉత్తరాంధ్రతో పాటు పలు రాష్ట్రాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)లో ముఖ్యమైన రక్త పరీక్షలు నిలిచిపోయాయి. దీనివల్ల పేద రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కిడ్నీ, ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులను నిర్ధారించే ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ (ఏబీజీ) పరీక్షలు గత కొన్ని రోజులుగా జరగడం లేదు. ఈ పరీక్షలకు అవసరమైన ‘రీజెంట్స్ లిక్విడ్’ సరఫరా లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. గతంలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల సంస్థ నుంచి ఈ లిక్విడ్ సరఫరా అయ్యేది. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సరఫరా నిలిచిపోయిందని తెలుస్తోంది. బయట నుంచి కొనుగోలు చేయడానికి కేజీహెచ్‌లోని కొంతమంది వైద్యాధికారులు ఇష్టపడకపోవడంతో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
రోగుల ఇబ్బందులు
ఏబీజీ పరీక్షలో రక్తంలో ఆక్సిజన్, కార్బన్ డయాకై ్సడ్ శాతాలను విశ్లేషిస్తారు. కిడ్నీ వైఫల్యం, గుండె లోపాలు, డయాబెటిస్, ఆస్తమా వంటి వ్యాధులను నిర్ధారించడానికి ఈ పరీక్షలు అత్యంత కీలకం. గతంలో కేజీహెచ్‌లో రోజుకు 40 నుంచి 80 మంది రోగులకు ఈ పరీక్షలు చేసేవారు. బయట ల్యాబరేటరీలలో ఈ పరీక్షకు రూ. 900 నుంచి రూ. 1,300 వరకు ఖర్చవుతుంది. ఆర్థిక స్తోమత లేని పేద రోగులు ఈ పరీక్ష కోసం ఎదురుచూస్తున్నారు.
యంత్రాలకు మరమ్మతులే కారణం
ఈ విషయంపై కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి మాట్లాడుతూ, ఏబీజీ పరీక్షలకు స్వల్ప అంతరాయం కలిగిందని తెలిపారు. యంత్రాలకు మరమ్మతులు జరుగుతున్నాయని, రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే ‘రీజెంట్స్ లిక్విడ్’ లేకపోవడం గురించి మాత్రం ఆమె స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దాటవేశారు.