
సరిహద్దు రహదారులపై శీతకన్ను.!
సీలేరు: జిల్లాలోని ఆంధ్ర, ఒడిశా సరిహద్దు రహదారులపై కూటమి ప్రభుత్వం శీతకన్ను వేసింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన వంతెనకు అప్రోచ్ రోడ్డు వేయకపోవడం.. భారీ వర్షాలకు ఓ వంతెన కొట్టుకుపోయినా పట్టించుకపోవడంతో గిరిజన గ్రామాల మీదుగా సరిహద్దు రహదారిలో రాకపోకలు సక్రమంగా సాగడం లేదు. గత ఐదు నెలలుగా ఈ ప్రాంత ప్రజలు వంతెన నిర్మించాలని మొర పెట్టుకున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సంబంధిత శాఖ అధికారులు అనుమతుల కోసం ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం ఉండడం లేదు. ఫలితంగా ఈ ప్రాంత ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
● ఆంధ్ర–ఒడిశా సరిహద్దు అయిన సీలేరు సమీప పిల్లిగెడ్డపై గత ప్రభుత్వం రూ.2.34 కోట్లు మంజూరు చేసి వంతెనను నిర్మించింది. అది పూర్తయినప్పటికీ రెండు వైపులా అప్రోచ్ రోడ్డు వేయడం కోసం రూ.30 లక్షలు మంజూరు చేయాలని ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధిత శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికీ నిధులు మంజూరు కాకపోవడంతో వంతెన నిర్మాణం పూర్తయినా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు వాహనాలు బురదలో కూరుకుపోతున్నాయి.
● దారకొండ నుంచి చిన్న గంగవరం గ్రామం మీదుగా ఒడిశా వెళ్లే ప్రధాన రహదారిలో గంగవరం వంతెనను 2014లో రూ.40 లక్షలతో నిర్మించారు. గత సెప్టెంబర్ నెలలో భారీ వర్షానికి ఈ వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. అప్పటి నుంచి ఈ వంతెనను నిర్మించాలని చుట్టుపక్కల గిరిజనులు మొరపెట్టుకుంటున్నా ఇప్పటికీ పట్టించుకోలేదు. 8 నెలలు కావస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. తాత్కాలికంగా నిర్మించిన వంతెన కూడా గత నెలలో కురిసిన వర్షానికి కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలకు సరిహద్దు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వంతెన నిర్మాణం కోసం సంబంధిత శాఖ అధికారులు ఇప్పటికే రూ.2 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా అతీగతీలేదు.
● జిల్లా నుంచి దారకొండ మీదుగా తూర్పుగోదావరి, ఛత్తీస్‌గఢ్, ఒడిశా వెళ్లేందుకు గుమ్మురేవులు రోడ్డు అనువుగా ఉంటుంది. అయితే ఇటీవల వర్షానికి కొట్టుకుపోయిన గంగవరం వంతెన మార్గం మధ్యలో మాదిగ మల్లు వంతెన అప్రోచ్ రోడ్డును ఇప్పటికీ పూర్తి చేయలేదు. గతేడాది సెప్టెంబర్‌లో వచ్చిన భారీ వర్షానికి కొట్టుకుపోవడంతో తాత్కాలికంగా నిర్మించి రాకపోకలు సాగించారు. అప్పటి నుంచి అసంపూర్తిగానే వంతెన ఉంది. తరచూ కురుస్తున్న వర్షాలకు అప్రోచ్ రోడ్డు సక్రమంగా లేకపోవడంతో రాకపోకలు ప్రమాదకరంగా మారాయి. చిన్నపాటి వర్షానికి వాహనాలు బురదలో కూరుకుపోతున్నాయి. రెండు వైపులా అప్రోచ్ రోడ్డు వేసేందుకు రూ.1.80 కోట్లతో జిల్లా కలెక్టర్ నుంచి అనుమతులు ఎట్టకేలకు వచ్చాయి. దీంతో టెండర్లు పిలిచినట్టు అధికారులు చెబుతున్నారు. అయినా ఇప్పటికీ పనులు ప్రారంభించలేదు.
భారీ వర్షానికి కొట్టుకుపోయిన చిన్న అగ్రహారం తాత్కాలిక వంతెన
అప్రోచ్ రోడ్డు లేక నిరుపయోగంగా పిల్లిగెడ్డ వంతెన
ప్రజలు మొరపెట్టుకుంటున్నా పట్టించుకోని కూటమి ప్రభుత్వం

సరిహద్దు రహదారులపై శీతకన్ను.!

సరిహద్దు రహదారులపై శీతకన్ను.!

సరిహద్దు రహదారులపై శీతకన్ను.!