
నిర్వాసితులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలం
చింతూరు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులకు పరిహారం ఇవ్వడంతో పాటు పునరావాసం కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ విమర్శించారు. పార్టీ రాజ్యసభ ఫ్లోర్‌లీడర్ జాన్‌బ్రిట్టాస్‌తో కలసి పోలవరం ముంపు మండలాల పర్యటనకు వచ్చిన ఆయన ఆదివారం చింతూరులో విలేకర్లతో మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన పునరావాసానికి రూ.33 వేల కోట్ల నిధులు మంజూరు చేయడంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం తగదన్నారు. పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు లేక నిర్వాసితులు తీవ్ర అవస్థలు పడుతున్నారని, తమ పర్యటనల్లో గుర్తించిన సమస్యలపై లోక్‌సభ, రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన తెలిపారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో గిరిజనులను సంఘటితం చేసి ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. పోలవరం నిర్వాసిత కాలనీల్లో ఎక్కడచూసినా నాసిరకం నిర్మాణాలు కనిపిస్తున్నాయన్నారు, తాగునీరు, విద్య, వైద్యం, రవాణా, ఉపాధి వంటి అవసరాలు లేక నిర్వాసితులు ఇబ్బందులు పడుతున్నారని జాన్‌బ్రిట్టాస్ అన్నారు.
వీఆర్‌పురం: రూ.వేలకోట్లతో రాజధాని నిర్మాణ పనులు చేపడుతున్న కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం నిర్వాసితులగోడు పట్టించుకోవడం లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, రాజ్యసభ సభ్యులు ఫ్లోర్ లీడర్ జాన్ బ్రిట్టాస్ ఆరోపించారు. రామవరంలో జరిగిన పార్టీ బహిరంగ సభలో వారు మాట్లాడారు. పోలవరం నిర్వాసితుల కాలనీ ఇళ్లు నిర్మించి నాలుగేళ్లు కాకముందే శ్లాబ్‌లు కారిపోతున్నందున బరకాలు వేసుకోవాల్సి వస్తోందన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి భూములు కేటాయించిన రైతులకు ఎకరాకు రూ.25 లక్షల వరకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి బొంప్పెన కిరణ్ ఎం వాణిశ్రీ, రాష్ట్ర నాయకులు తులసీదాసు, బలరాం తదితరులు పాల్గొన్నారు.
ఎటపాక: పోలవరం నిర్వాసితుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ల్యక్షం చేస్తున్నాయని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం విమర్శించారు. మండలంలోని నర్సింగపేట పోలవరం నిర్వాసిత కాలనీలో ఆదివారం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పోలవరం జాతీయ ప్రాజెక్ట్ కావడంతో నిర్వాసితుల సమస్యలు కూడా జాతీయ సమస్యగా గుర్తించాలని సూచించారు. కాంటూరు లెక్కలు కాకి లెక్కలని, నిర్వాసితులందరికీ న్యాయం చేసిన తరువాతనే ప్రాజెక్టు నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. కాలనీల్లో నిర్వాసితులు బతుకులు దుర్భరంగా మారాయని, నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ఉద్యమాలే సరైన మార్గమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిల్లో సురేంద్ర, బొప్పెన కిరణ్, మర్లపాటి నాగేశ్వరరావు, లోతా రామారావు, మట్ల శ్రీవాణి, ఐవీ, మేకల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ

నిర్వాసితులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలం