
ముగిసిన సీపీఐజిల్లా మహాసభలు
రంపచోడవరం: స్థానికంగా చేపట్టిన సీపీఐ జిల్లా మహాసభలు ఆదివారం రెండో రోజు ముగిశాయి. నీ సందర్భంగా పలు సమస్యలపై తీర్మానాలు చేశారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవీ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాటు పడాలన్నారు. పోలవరం నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు ఏమాత్రం తగ్గేది లేదని స్పష్టం చేశారు.
ఘాట్‌లో విరిగిపడినబండరాళ్లు
● గిరిజనులకు త్రుటిలో తప్పిన ప్రమాదం
ముంచంగిపుట్టు: మండలంలోని అత్యంత మారుమూల రంగబయలు పంచాయతీ కోసంపుట్టు ఘాట్ మార్గంలో వర్షానికి పెద్ద బండరాళ్లు ఆదివారం సాయంత్రం రోడ్డుకడ్డంగా జారిపడ్డాయి. సాయంత్రం 5గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జోలాపుట్టు వారపు సంతనుంచి గ్రామాలకు బయలేదరిన కోసంపుట్టు, జోడిగుమ్మ, పట్నపడాల్‌పుట్టు గ్రామాల గిరిజనులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. వాహనదారులు భయంతో పరుగులు పెట్టారు. కొంచెం ఆలస్యంగా వచ్చి ఉంటే బండరాళ్లు తమపై పడి ప్రమాదానికి గురయ్యేవారమని వారు వాపోయారు.
ప్రమాదభరితంగా మార్గం
మట్టిగూడ నుంచి జోడిగుమ్మ వరకు ఆరు కిలో మీటర్ల ఘాట్ రోడ్డు మార్గం ప్రమాదభరితంగా ఉంది. పలు ప్రదేశాల్లో పెద్ద పెద్ద బండరాళ్లు, చెట్లు, మట్టి దిబ్బలు పడిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. తక్షణమే పంచాయతీరాజ్ అధికారులు స్పందించి ఘాట్ మార్గంలో రక్షణ గోడలు నిర్మించాలని ఆయా ప్రాంతాల గిరిజనులు కోరుతున్నారు.