
అడ్డతీగల ఆస్పత్రిలో అంధకారం
నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
కటిక చీకట్లో రోగులు, బంధువుల అవస్థలు
ఆందోళనకు గురైన శిశువుల తల్లులు
సెల్‌ఫోన్ వెలుగులో సపర్యలు
జనరేటర్ ఉన్న ఉపయోగించని సిబ్బంది
ప్రశ్నిస్తే కుంటిసాకులు
అడ్డతీగల: స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కటిక చీకట్లో రోగులు, వారి బంధువులు అవస్థలు పడ్డారు. పిల్లల తల్లులు భయాందోళనకు గురయ్యారు. శిశువులను పొత్తిళ్లలో పెట్టుకుని సెల్‌ఫోన్ వెలుగులో గడిపారు. ఆస్పత్రికి జనరేటర్ సౌకర్యం ఉన్నా సిబ్బంది వినియోగించడం లేదని రోగులు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆయిల్ లేదని.. ఆపరేటర్ లేరని సిబ్బంది, అధికారులు కుంటిసాకులు చెబుతున్నారన్నారు. మండలంలోని 99 గ్రామాలకు పెద్ద దిక్కయిన ఈ ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా లేనప్పుడు అంధకారం రాజ్యమేలుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.