చింతూరు: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విలీన మండలాల్లో గోదావరి, శబరి నదుల నీటిమట్టాలు క్రమేపీ పెరుగుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం ఆదివారం రాత్రికి 33.7 అడుగులకు చేరుకుంది. కూనవరం మండలంలో గోదావరి, శబరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మండలంలోని కొండ్రాజుపేట వాగు ఎగపోటుకు గురై వరదనీరు కాజ్‌వే పైకి చేరడంతో కూనవరం, టేకులబోరు నుంచి కొండ్రాజుపేట, వాల్ఫర్డ్‌పేట, శబరికొత్తగూడెం, ఆంబోతులగూడెం, వెంకన్నగూడెం, శ్రీరాంపురం, కొత్తూరు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. శబరి, గోదావరి సంగమం వద్ద గోదావరి నీటిమట్టం 27.8 అడుగులకు చేరుకుంది.
● వీఆర్‌పురం మండలం అన్నవరం వాగు పైనున్న కాజ్‌వే కొట్టుకుపోగా తాత్కాలికంగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో నేటీకీ చింతూరు, వీఆర్‌పురం మండలాల మధ్య, వీఆర్‌పురం మండలంలో 42 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగు ఉధృతి తక్కువైనప్పుడు ఆయా ప్రాంతాల ప్రజలు ప్రాణాలకు తెగించి దాటుతున్నారు. కాజ్‌వే కూలిపోవడంతో చింతూరు మీదుగా వీఆర్‌పురం వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులు చట్టి మీదుగా కూనవరం చేరుకుంటున్నాయి. దీనివల్ల ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
● ఎగువనుంచి వస్తున్న వరదనీటి వల్ల చింతూరు మండలంలో కూడా శబరినది క్రమేపీ పెరుగుతోంది. ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులు లేకున్నా గోదావరి మరింత పెరిగితే శబరినది ఎగపోటుకు గురై మండలంలో పలు వాగులు పొంగే అవకాశముందని నదీ పరివాహక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి:
చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ ఆదేశం
గోదావరి, శబరి నదుల నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో నాలుగు మండలాలకు చెందిన అధికారులు అప్రమత్తంగా ఉండాలని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ ఆదేశించారు. ఆదివారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే నాలుగు మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామన్నారు. సెప్టెంబరు నెలకు సబంధించిన రేషన్ బియ్యాన్ని ఆయా దుకాణాలకు తరలించినట్టు చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో జనరేటర్లు ఏర్పాటు చేశామన్నారు. నాలుగు మండలాల్లో 440 హైరిస్క్ గర్భిణులను గుర్తించడం జరిగిందని, వరద పెరిగితే వారిని సమీప ఆస్పత్రులకు తరలించేలా ఏర్పాట్లు చేశామన్నారు. వరద పెరిగితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 10 లాంచీలు, నాటు పడవలను సిద్ధం చేశామన్నారు. మంగళవారం వరకు గోదావరి వరద పెరిగే అవకాశముందని సీడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఆయన సూచించారు.
ముందస్తు జాగ్రత్తలు చేపట్టండి
కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం
పాడేరు : అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుచేసి ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. ఆదివారం తన కార్యాలయం నుంచి జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాల్లో ప్రత్యేకంగా దండోరా వేసి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ముందస్తుగా ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులు, జనరేటర్లు, తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, చిన్నారులు, వృద్ధులను ప్రత్యేకశ్రద్ధతో పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. జేసీ అభిషేక్ గౌడ, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పీవోలు కట్టా సింహాచలం, అపూర్వ భరత్, డీఆర్వో పద్మలత, ఎస్‌డీసీలు, రెవెన్యూ అధికారులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
అపమ్రత్తమైన అధికార యంత్రాంగం
తహసీల్దార్ కార్యాలయాల్లో
కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
హైరిస్క్ గర్భిణులను ఆస్పత్రికి
తరలించేలా ముందస్తు ఏర్పాట్లు
వరద ప్రభావిత ప్రాంతాల్లో
10 లాంచీలు, పడవలు సిద్ధం
పెరుగుతున్న గోదావరి, శబరి నీటిమట్టాలు
పెరుగుతున్న గోదావరి, శబరి నీటిమట్టాలు