
సొంత గూటికి ముంచంగిపుట్టు ఏకలవ్య పాఠశాల
పెదబయలు: ముంచంగిపుట్టు మండల ఏకలవ్య రెసిడెన్సియల్ పాఠశాలకు ఎట్టకేలకు సొంత గూటికి చేరింది. సొంత భవనం లేక 8 ఏళ్లుగా పెదబయలు వైటీసీ భవనంలో ఈ పాఠశాల నడుస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పాఠశాలకు మంజూరైన సొంత భవన నిర్మాణ పనులను ముంచంగిపుట్టు మండలం లబ్బూరులో రూ.12 కోట్లలో ప్రారంభించారు. రెండు అంతస్తులతో నిర్మాణం చేయాల్సిన పాఠశాల భవనాన్ని కూటమి ప్రభుత్వం గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే నిర్మించి వదిలేసింది. అయినా ఐటీడీఏ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం ప్రత్యేక బస్సుల్లో విద్యార్థులను అసంపూర్తి భవనంలోకి తరలించారు. విద్యార్థినీ, విద్యార్థులకు పాఠశాల వసతి గృహంలో 48 గదులు మాత్రమే ఉన్నాయి. ఒక్కో గదిలో 8 మంది చొప్పున విద్యార్థులు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం పది నుంచి 12 మందిని ఉంచారు. భారీ వర్షానికి గదుల్లో నీరు చేరడంతో అవస్థలు పడ్డారు. పాఠశాలను త్వరితగతిన పూర్తి చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఊరికి దూరంగా కొండ ప్రాంతంలో నిర్మించిన పాఠశాలకు ప్రహరీ లేదని, ఉన్నతాధికారులు స్పందించి సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు సరిపడా తరగతి గదులు కూడా లేవని చెబుతున్నారు. అసంపూర్తిగా భవనాల్లోకి తమ పిల్లలకు తరలించి ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకోమని, పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
లబ్బూరులో రూ.12 కోట్లతో
భవన నిర్మాణం
వైఎస్సార్‌సీపీ హయాంలో
నిధుల మంజూరు
మొదటి అంతస్తుతో సరిపెట్టిన
కూటమి ప్రభుత్వం
విద్యార్థులకు తప్పని అవస్థలు

సొంత గూటికి ముంచంగిపుట్టు ఏకలవ్య పాఠశాల