
బస్సులకు బోర్డులు, స్టిక్కర్లు పెడుతున్న ఆర్టీసీ
‘స్త్రీశక్తి’కి నోచుకోని విలీన మండలాలు
ఆగ్రహం వ్యక్తంచేస్తున్న మహిళలు
అడ్డగోలు నిబంధనలతో అన్యాయం చెయ్యొద్దంటున్న స్థానికులు
ఆంధ్రాలోనైనా ఉచిత ప్రయాణానికి అనుమతించాలని వినతి
చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా)/సింహాచలం (విశాఖ): టీడీపీ కూటమి ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు పథకానికి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాలకు చెందిన మహిళలు నోచుకోవడంలేదు. ఇక్కడ తిరుగుతున్న బస్సులు అంతర్రాష్ట్ర సర్వీసులని.. వీటికి స్త్రీశక్తి పథకం వర్తించదంటూ వాటిపై స్టిక్కర్లు అతికించి, బోర్డులు పెట్టి మరీ సర్వీసులు నడుపుతున్నారు. విలీన మండలాలైన చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాకల్లో ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాకు చెందిన పలు బస్సులు నిత్యం తిరుగుతుంటాయి.
ఆంధ్రాలోని విజయవాడ, గన్నవరం, కాకినాడ, గోకవరం, రాజమహేంద్రవరం, రాజోలు డిపోలకు చెందిన బస్సులు ఆయా మండలాల మీదుగా తెలంగాణలోని భద్రాచలం వరకు ప్రతిరోజూ తిరుగుతాయి. అలాగే, వీఆర్‌పురం నుండి కూనవరం మీదుగా భద్రాచలానికి షటిల్ సర్వీసులుగా పల్లెవెలుగు బస్సులు నడుస్తున్నాయి. నిన్నటివరకు విలీన మండలాల్లో మామూలుగానే తిరిగిన ఈ బస్సులు.. స్త్రీశక్తి పథకం ప్రారంభమైన వెంటనే ‘అంతర్రాష్ట్ర సర్వీసు.. స్త్రీశక్తి పథకం వర్తించదు’.. అంటూ బస్సులపై బోర్డులు దర్శనమిచ్చాయి. దీంతో ప్రభుత్వ తీరుపై ఇక్కడి మహిళలు మండిపడుతున్నారు. అంతర్రాష్ట్ర సర్వీసులంటూ తమకు ఉచిత ప్రయాణం లేకుండా చేస్తున్నారంటున్నారు.
ఆంధ్రా సరిహద్దుల నుండి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో వున్న తమకు ఈ పథకం నిలిపివేయడం దారుణమని వారు వాపోతున్నారు. మరోవైపు.. విజయవాడ, గన్నవరం డిపోలకు చెందిన బస్సులు భద్రాచలం మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోని కుంట, ఒడిశాలోని మోటు పేరుతో సర్వీసులు నడుస్తున్నాయి. ఇవి ఆయా రాష్ట్రాల్లోకి వెళ్లకుండా కేవలం సరిహద్దుల వరకు మాత్రమే నడుస్తున్నాయి. వీటిల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం వర్తింపచేయకుండా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులంటూ బోర్డులు పెడుతున్నారు.
ఆంధ్రాలోనైనా వర్తింపచేయాలి..
ఇక భద్రాచలం నుండి విలీన మండలాలకు వచ్చే బస్సులకు సంబంధించి నెల్లిపాక వరకు టికెట్ తీసుకుని అక్కడి నుండి ఆంధ్రానే కనుక ఉచిత బస్సు ప్రయాణం అనుమతించాలని మహిళలు కోరుతున్నారు. అదేవిధంగా.. కాకినాడ, రాజమహేంద్రవరం, రాజోలు, గోకవరం డిపోల నుండి భద్రాచలం వెళ్లే సర్వీసులకు నెల్లిపాక వరకు ఉచిత ప్రయాణం అనుమతించి అక్కడి నుండి భద్రాచలానికి టికెట్ తీసుకోవాలని వారు కోరుతున్నారు.
మా ప్రాంతం ఈ రాష్ట్రంలో లేదా?
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వర్తిస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పథకం మా ప్రాంతానికి ఎందుకు వర్తించదు? మా ప్రాంతం ఈ రాష్ట్రంలో లేకుండా పోయిందా అనేది ప్రభుత్వం చెప్పాలి. ఇతర రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో జీవించడమే మేం చేసిన నేరమా.. అడ్డగోలు నిబంధనలతో ఈప్రాంత మహిళలకు అన్యాయం చేయడం సబబు కాదు. – ముచ్చిక లక్ష్మి, మామిళ్లగూడెం, చింతూరు మండలం
సింహాచలంలో సరికొత్త సమస్య..
ఇదిలా ఉంటే.. సింహాచలం వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో కొత్త సమస్య ఎదురైంది. కొండపైకి వెళ్లే ఒక్కో ప్రయాణికుడి టికెట్ ధర రూ.25 కాగా.. అందులో రూ.5 దేవస్థానానికి చెల్లించడం ఆనవాయితీ. ఇప్పుడు మహిళలకు జీరో టికెట్ ఇస్తుండటంతో, దేవస్థానానికి చెల్లించాల్సిన రూ.5 అంశంపై చర్చ జరుగుతోంది. ఈ మొత్తం చెల్లిస్తారా లేదా అనే దానిపై స్పష్టత కరువైంది.