
రోడ్డు నిర్మించాలని యువత ఆందోళన
అడ్డతీగల: అధ్వానంగా మారిన రోడ్డును వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ నాలుగు గ్రామాలకు చెందిన యువకులు ఆందోళనకు దిగారు. రోడ్డుకు అడ్డంగా బైఠాయించి నిరసన తెలిపారు. అడ్డతీగల–ఏలేశ్వరం రోడ్డులో సుమారు 11 కిలోమీటర్ల రోడ్డు కాలు పెట్టలేని విధంగా దారుణంగా మారింది. దీనిని మెరుగుపరిచేందుకు అధికారులు ఏమాత్రం చర్యలు చేపట్టకపోవడంతో ఈమార్గంలో వెళ్లేవారు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో ప్రభుత్వం, అధికారుల తీరును నిరసిస్తూ తూర్పు లక్ష్మీపురం, కిమ్మూరు,జెడ్డంగి అన్నవరం, గొంటువానిపాలెంకు చెందిన యువకులు శనివారం రమణయ్యపేట వద్ద సుమారు నాలుగు గంటలపాటు ధర్నా చేశారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అధ్వానంగా మారిన ఈ రోడ్డుకు కనీసం మరమ్మతులు కూడా చేయకపోవడం వల్ల గత 20 ఏళ్లుగా నరకం చూస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డతీగల, రాజవొమ్మంగి, వై.రామవరం, గంగవరం మండలాల ప్రజలతోపాటు నర్సీపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లేవారు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. రోడ్డు నిర్మాణానికి రూ.కోట్లు కేటాయించినట్టు హడావుడి చేసి భూమి పూజలు చేస్తున్నా పనులు మాత్రం అంగుళమైనా ముందుకు కదలలేదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రులకు తీసుకువెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డు పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
అధికారుల తీరుపై నిరసన

రోడ్డు నిర్మించాలని యువత ఆందోళన