
సమస్యలు పరిష్కరించడంలో చంద్రబాబు, మోదీ విఫలం
రంపచోడవరం: పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చూపడంలో సీఎం చంద్రబాబు, పీఎం మోదీ ఇద్దరూ విఫలం చెందారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తంచేశారు. రంపచోడవరంలో సీపీఐ జిల్లా మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. ముందుగా పార్టీ శ్రేణులు అటవీశాఖ చెక్ పోస్ట్ నుంచి భారీ ర్యాలీ గా అంబేద్కర్ సెంటర్ మీదుగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం స్టేట్ బ్యాంకు వద్ద జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం విధానాలను ఎండ గట్టారు. త్వరలోనే తమ పార్టీ ఆధ్వర్యంలో పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం తానే స్వయంగా ఈ ప్రాంతంలో పోరాటం చేస్తామని ప్రకటించారు. గిరిజన ప్రజల సమస్యలు అంటే ఈ ప్రభుత్వాలకు పట్టడం లేదని, ఎంత సేపు మోదీ కార్పొరేట్ల సేవలోనే తరిస్తూ అంబానీ, అదానీలకు దేశ సంపదను దోచి పెడుతున్నారన్నారు. ఒంగోలులో లక్షలాది మందితో రాష్ట్ర మహా సభలు జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్య నారాయణమూర్తి మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి ఎప్పుడు మావోయిస్టులను అంతం చేయడమే మా ఎజెండా అంటూ వరుస ఎన్‌కౌంటర్లు చేయిస్తున్నారని, గిరిజన ప్రజల సమస్యలపై ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ ప్రజల బాగోగులు కోసం పోరాటం చేసే ఏకై క పార్టీ సీపీఐ అన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డేగ ప్రభాకర్ , జాతీయ సమితి సభ్యులు తాటిపాక మధు , జిల్లా కార్యదర్శి పొట్టిక సత్య నారాయణ మాట్లాడారు. రంపచోడవరం డివిజన్ కార్యదర్శి జుత్తుక కుమార్ , మహిళా నాయకురాలు దుర్గ, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.