
బర్లీ సాగుపై పెరుగుతున్న ఆసక్తి
● ప్రోత్సహిస్తున్న ఐటీసీ కంపెనీ
● గతేడాది రూ.25కోట్ల విలువైన
17 లక్షల కిలోలు కొనుగోలు
● కిలోకు రూ.155 చొప్పున ధర చెల్లింపు
రాజవొమ్మంగి: గిరిజన రైతులు వైట్ బర్లీ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. రాజవొమ్మంగి కేంద్రంగా కొయ్యూరు, అడ్డతీగల మండలాల్లో సుమారు 3వేల ఎకరాల్లో సాగు చేపట్టేలా గిరిజన రైతులను ప్రముఖ ఐటీసీ కంపెనీ ప్రోత్సహిస్తోంది. ఈ ప్రాంత రైతులు రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల నుంచి బర్లీ పొగాకు నారు తీసుకువచ్చి నాట్లు మొదలుపెట్టారు. రాజవొమ్మంగి, వట్టిగెడ్డ, సూరంపాలెం, లబ్బర్తి, జడ్డంగి–అన్నవరం, అమీనాబాద్, కంఠారం, బాలారం తదితర గ్రామాల్లో కూడా ఐటీసీ కంపెనీ నారు పెంచి రైతులకు సరఫరా చేస్తోంది. గతేడాది రైతుల నుంచి రూ.25 కోట్ల విలువైన 17 లక్షల కిలోల బర్లీ పొగాకును ఐటీసీ కంపెనీ కొనుగోలు చేసింది. ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసింది. కిలోకు రూ.155 చొప్పున ధర చెల్లించింది. దీంతో పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నందున సాగు పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు.