
ప్రమాదస్థాయికి జోలాపుట్టు, డుడుమ
● పెరుగుతున్న నీటిమట్టాలు
● అప్రమత్తమైన ప్రాజెక్ట్ అధికారులు
● 1300 క్యూసెక్కులు బలిమెలకు విడుదల
ముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి నీరందించే డుడుమ, జోలాపుట్టు జలాశయాల నీటి మట్టాలు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. గత వారం రోజులుగా సరిహద్దులో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. డుడుమ జలాశయ నీటి సామర్థ్యం 2590 అడుగులు కాగా శుక్రవారం నాటికి 2581.60 అడుగులుగా నమోదయింది. డుడుమ జలశయ ఎగువన ఉన్న జోలాపుట్టు జలాశయ నీటి మట్టం సైతం క్రమేపి పెరుగుతూ వస్తోంది. జోలాపుట్టు జలాశయ నీటి సామర్థ్యం 2750 అడుగులు కాగా శుక్రవారం నాటికి 2741.15 అడుగులు నీటి నిల్వ ఉంది. నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరడడంతో అప్రమత్తమైన జలాశయ సిబ్బంది నిరంతరం నీటి నిల్వలను అంచనా వేస్తున్నారు.డుడుమ జలాశయం ఒకటో నెంబర్ గేటును ఎత్తి 1300 క్యూస్కెలు దిగువనున్న బలిమెల జలాశయానికి విడుదల చేస్తున్నారు. ప్రమా దస్థాయి నుంచి సాధారణ స్థాయికి తెచ్చేందుకు ప్రాజెక్టు అధికారులు, సిబ్బంది శ్రమిస్తున్నారు.

ప్రమాదస్థాయికి జోలాపుట్టు, డుడుమ