
రాజవొమ్మంగి సర్పంచ్ ఉత్తమ సేవలకు గుర్తింపు
● కేంద్రమంత్రి చేతులమీదుగా అవార్డు అందుకున్న రమణి
రాజవొమ్మంగి: ఢిల్లీలో శుక్రవారం జరిగిన స్వాతంత్య్రదిన వేడుకల్లో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి వివేక్ భరద్వాజ్ చేతులమీదుగా స్థానిక సర్పంచ్ గొల్లపూడి రమణి ఉత్తమ అవార్డు అందుకున్నారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆమె వేడుకలకు హాజరయ్యారు. పంచాయతీలో ఆమె చేపడుతున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు అందజేసింది. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు.
ఏకలవ్య పాఠశాల భవనాలను త్వరలో ప్రారంభిస్తాం
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్‌స్కూళ్ల ఓఎస్డీ మూర్తి
ముంచంగిపుట్టు: మండలంలోని జోలాపుట్టు పంచాయతీ లబ్బూరు సమీపంలో నిర్మిస్తున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల నూతన భవనాలను త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల ఓఎస్డీ మూర్తి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన నిర్మాణ దశలో ఉన్న ఏకలవ్య పాఠశాల భవనాలను పరిశీలించారు. పాఠశాల నిర్వహణకు అవసరమైన వసతులపై పరిశీలించారు. ముంచంగిపుట్టు ఏకలవ్య పాఠశాలకు చెందిన ఎస్‌ఎంసీ కమిటీ సభ్యులు ఆయనను కలిసి ఏకలవ్య పాఠశాలను లబ్బూరులోకి మార్చి తరగతులు నిర్వహించి వసతులు కల్పించాలని కోరారు.పెదబయలు వైటీసీలో కనీస సౌకర్యాలు లేక తమ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. దీనిపై స్పందించిన ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు లబ్బూరులో ఏకలవ్య పాఠశాలను త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. భవనాలు,సౌకర్యాల పరిస్థితులను తెలుసుకునేందుకు వచ్చినట్టు ఆయన వివరించారు. ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపాల్ సుమన్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.