
నేవీ నిఘా వ్యవస్థలో ఏఐ వినియోగం
● ఫిబ్రవరిలో అంతర్జాతీయ
నౌకాదళ కార్యక్రమాలు
● తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్
సాక్షి, విశాఖపట్నం: వచ్చే ఏడాది ఫిబ్రవరి.. భారత నౌకాదళానికి పండగలా మారనుందని తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ అన్నారు. తూర్పు నౌకాదళ ప్ర ధాన స్థావరంలో ఈఎన్‌సీ ఫ్లాగ్ ఆఫీ సర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన గౌరవ వందనం స్వీకరించారు. వివిధ ప్లాటూన్‌లు, నౌకాదళ సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్స్, వివిధ నౌకల సిబ్బంది మార్చ్‌పాస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖ నగరం ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలన్–2026 విన్యాసాలు, ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియంకు ఆతిథ్యం ఇవ్వనుందని తెలిపారు. ఇప్పటివరకు జరిగిన మిలన్ విన్యాసాల్లో ఇది అతి పెద్దదిగా నిలవనుందని.. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో సముద్ర ప్రయోజనాలను కాపాడే దేశాల్లో భారత్ ముందుందని వెల్లడించారు. ఆత్మనిర్బర్ భారత్ లక్ష్యంలో భాగంగా.. దేశీయ షిప్‌యార్డుల్లో 60కి పైగా యుద్ధ నౌకలు, సబ్‌మైరెన్‌ల నిర్మాణం జరుగుతోందన్నారు. ఈ నెల 26న విశాఖలో ఐఎన్‌ఎస్ ఉదయగిరి, ఐఎన్‌ఎస్ హిమగిరి యుద్ధ నౌకలను నేవీ అమ్ములపొదిలో చేరనున్నాయని వివరించారు. అలాగే ఈ ఏడాది చివరలో మరో రెండు యాంటీ సబ్‌మైరెన్ వార్‌షిప్‌లు జాతికి అంకితం చేయనున్నట్లు తెలిపారు. నేవల్ సిబ్బంది ఆరోగ్య సంరక్షణ కోసం ఐఎన్‌హెచ్‌ఎస్ కల్యాణి ఆసుపత్రిని పూర్తిస్థాయి కమాండ్ ఆసుపత్రిగా ఆధునికీకరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సముద్ర భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి నిఘా వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వాడుతున్నామని ఈఎన్‌సీ చీఫ్ తెలిపారు. మానవరహిత ఉపరితల, నీటి అడుగున పోరాడే వ్యవస్థలతో పాటు, అధునాతన ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్స్, నెక్స్ట్–జెన్ మిస్సైల్స్‌తో నేవీ అప్‌గ్రేడ్ అయిందన్నారు. ఈ వేడుకల్లో ఈఎన్‌సీ చీఫ్ ఆఫ్ స్టాఫ్, వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనాతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
సబ్బవరం: చిన్నయ్యపాలెం సమీపంలో అనకాపల్లి–ఆనందపురం హైవేను ఆనుకుని బోర్రమ్మగెడ్డ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమయ్యింది. పొదల్లో పడివున్న మృత దేహాన్ని గుర్తించిన స్థానికులు 112కు ఫోన్ చేసి సమాచారం అందించారు. పెందుర్తి పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి సబ్బవరం పరిధి కావడంతో సబ్బవరం పోలీసులకు సమాచారం అందించారు. సీఐ జి.రామచంద్రరావు, ఎస్‌ఐ దివ్య, సిబ్బందితో కలిసి వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని గుర్తించి వెలికి తీయించారు. శరీరం బాగా ఉబ్బిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. సుమారు 40–45 ఏళ్ల వయసున్న మృతుడి శరీరంపై నిక్కరు, బని యన్, చేతికి రాగి కడియం ఉంది. మరణించి నాలుగైదు రోజులై ఉంటుందని సీఐ తెలిపారు. ఒక బిచ్చగాడు ఈ ప్రాంతంలో సంచరించేవాడని, ప్రస్తుతం కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. మృతుడు ఆ బిచ్చగాడేనన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించినట్లు సీఐ తెలిపారు.
నాణ్యతతో నిరంతర విద్యుత్ సరఫరా
సీతంపేట: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ కార్పొరేట్ కార్యాలయ ఆవరణలో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ పృథ్వీతేజ్ ఇమ్మడి జాతీయ జెండాను ఎగురవేశారు. సంస్థ పరిధిలో 73 లక్షల వినియోగదారులకు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో నిరంతరాయ విద్యుత్ సేవలందిస్తూ.. ప్రసార పంపిణీ నష్టాలను 5.8శాతం కంటే తక్కువకు తగ్గించినట్లు తెలిపారు. పీవీటీజీ గిరిజన ఆవాసాల్లో 23,024 ఇళ్లకు, డీఏ–జేజీయూఏ పథకంలో 1979 ఇళ్లకు, అలాగే 13 వేలు ఇళ్లకు నాన్ పీవీటీజీ విద్యుత్ సదుపాయం కల్పించామన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద 19,385 గృహాలపై 63,522 మెగావాట్ల సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆర్‌డీఎస్‌ఎస్ పథకంలో భాగంగా 3004 కోట్లతో గ్రామీణ ప్రాంతాలకు నిరంతర త్రీ ఫేజ్ సరఫరా కోసం కొత్త ఫీడర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన 97 మంది ఉద్యోగులకు సీఎండీ ప్రశంసాపత్రాలు అందజేశారు. సంస్థ డైరెక్టర్లు డి.చంద్రం, టి.వి.సూర్యప్రకాష్, టి.వనజ, సీజీఎంలు డి.సుమన్ కల్యాణి, వి. విజయలలిత, అచ్చి రవికుమార్ పాల్గొన్నారు.

నేవీ నిఘా వ్యవస్థలో ఏఐ వినియోగం

నేవీ నిఘా వ్యవస్థలో ఏఐ వినియోగం