
చింతపల్లిలోనే కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుచేయాలి
చింతపల్లి: కాఫీ ప్రాసెసింగ్ యూనిట్‌ను చింతపల్లిలోనే ఏర్పాటు చేయాలని ఎంపీపీ కోరాబూ అనూష, జెడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్యపడాల్ డిమాండ్ చేశారు. వారు శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. అల్లూరి జిల్లాలోనే అత్యధిక కాఫీ పంట దిగుబడులు చింతపల్లి, గూడెం కొత్తవీధి, కొయ్యూరు, జి.మాడుగులు మండలాల్లో పండుతుందని, కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ చింతపల్లి ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు. ఈ యూనిట్ ఏర్పాటుకు అవసరమైన ఎంతో ప్రభుత్వ భూమి స్థానికంగా అందుబాటులో ఉందన్నారు. అన్ని విధాలుగా అవకాశాలున్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో కాకుండా మైదాన ప్రాంతమైన మాకవరపాలెం మండలం శెట్టిపాలెంలో ఈ కాఫీ ప్రాసెసింగ్ యూని ట్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించడం దారుణమన్నారు. అంతర్జాతీయంగా పేరు గాంచిన కాఫీ దిగుబడులు మన్యంలో అయితే.. ఉపాధి అవకాశాలు మైదాన ప్రాంత వాసులకా అని ప్రశ్నించారు.ఇప్పటికే జీవో నెం–3 రద్దుతోపాటు ఎంతో ప్రాదాన్యత కలిగినటువంటి డైరీ ఫారం, మల్బరీ ఫారం, ఎత్తివేతతో ఎన్నో విధాలుగా గిరిజన నిరుద్యోగులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విదంగా గిరిజన యూనివర్సిటీని తరలించకుపోవడంతో పాటు నవోదయ పాఠశాలకు 22 ఎకరాలు స్థల సేకరణ చేసి కూడా పట్టించుకోలేదన్నారు.ఇటీవల ఎత్తివేతకు సిద్ధమైన సేంద్రీయ వ్యవసాయ పాలిటెక్నిక్‌ను కూడా ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు పోరాటం చేసి నిలుపుకోగా గలిగామన్నారు. ఈ ప్రాంతంలో వస్తునటువంటి ఉపాధి అవకాశాలకు గండి కొట్టడం వలనే ఎంతోమంది గిరిజన నిరుద్యోగ యవత ఉపాధి లేక వారి జీవనం దుర్భరంగా మారుతుందన్నారు. కాఫీ ప్రాసిసెంట్ యూనిట్‌ను చింతపల్లిలో ఏర్పాటు చేస్తే ఎంతో మంది గిరిజన నిరుద్యోగులకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి దొరుకుతుందన్నారు. గిరిజన రైతాంగానికి, నిరుద్యోగ యువతకు ఎంతో ప్రయోజనకరంగా ఉండే కాఫీ ప్రాసెసింగ్ యూనిట్‌ను చింతపల్లిలోనే ఏర్పాటు చేసే విధంగా మన్య ప్రాంత మేధావులు, రైతాంగం, ఉద్యోగ ఉపాధ్యాయ, యువత, అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.