
కళ్లెదుట మృత్యువు.. పరిమళించిన దాతృత్వం
పెందుర్తి: అతని దాతృత్వం ముందు మృత్యువు కూడా చిన్నబోయింది. కళ్లెదుటే మరణం కనిపిస్తున్నా అతని మనసు మాత్రం మరో ఇద్దరికి వెలుగునిచ్చేందుకే పరితపించింది. కుటుంబ సభ్యులకు జాగ్రత్తలు చెబుతూనే తాను మరణించిన వెంటనే కళ్లను దానం చేయాలని సూచించారు. పెందుర్తిలో నివాసం ఉంటున్న మద్దాల శివాజీ(65) అనారోగ్యానికి గురయ్యారు. కొద్ది రోజులుగా శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో తన మరణం తప్పనిసరని మానసికంగా సిద్ధమయ్యారు. దీంతో పది రోజులుగా ‘నేను చనిపోయాక నా కళ్లు దానం ఇవ్వండి.. సాయి హెల్పింగ్ హ్యాండ్స్ శ్రీనుకు కబురు పెట్టండి’అంటూ నిత్యం కుమార్తెలు రమ్య, దీపిక, భార్య అచ్యుతాంబకు సూచించేవారు. శుక్రవారం ఉదయం పరిస్థితి విషమించి శివాజీ కన్నుమూశారు. తండ్రి చివరి కోరిక మేరకు కుమార్తెలు పెందుర్తికి చెందిన సాయి హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకుడు దాడి శ్రీనివాస్‌కు సమాచారం ఇచ్చి తండ్రి నేత్రాలను దానం చేసేందుకు అంగీకారం తెలిపారు. మొహిషిన్ నేత్రనిధి ప్రతినిధులు శివాజీ నేత్రాలను సేకరించి సురక్షితంగా ఐ బ్యాంక్‌కు తరలించారు.
కొద్దిరోజుల్లో మరణిస్తానని తెలిసి
ఓ వ్యక్తి నేత్రదానం

కళ్లెదుట మృత్యువు.. పరిమళించిన దాతృత్వం