
అధ్వానంగా జాతీయ రహదారి
ఎటపాక: ఇసుక లారీల హోరుతో ప్రధాన రహదారి చిద్రమైంది. జాతీయ రహదారిపై గోతుల్లో వాహనాలు వెళ్లాలంటే సాహసమే. ఆంధ్రా– తెలంగాణ సరిహద్దు ప్రాంతం ఎటపాక వద్ద జాతీయ రహదారి వాహనదారులకు చుక్కలు చూపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ప్రాంతం నుంచి నిత్యం వందలాది ఇసుకలారీలు ఆంధ్రా సరిహద్దు ప్రాంతం ఎటపాక మీదుగా భద్రాచలం వైపు వెళ్తుంటాయి. అయితే అధిక లోడు, భారీ వాహనాల కారణంగా ఎటపాక పోలీస్టేషన్ సమీపంలో రహదారిపై పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయి. భారీ వర్షాలకు గోతుల్లో నీరు నిలవడంతో ద్విచక్రవాహనాలు, కార్లు, ఆటోల ప్రయాణానికి సంకటంగా మారింది. ఈక్రమంలో వాహనాలు ఎక్కడివి అక్కడే నిలిచిపోతుండడంతో తరచూ భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. గురువారం మధ్యాహ్నం సమయంలో కూడా ఇదే రీతిలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. భద్రాచలం పట్టణానికి వచ్చే ఓ అంబులెన్స్ కూడా సుమారు 30 నిమిషాల ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది. రహదారి దుస్ధితి కారణంగా వాహనదారులు గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే వారే లేరు. ఇసుక లారీలను నియంత్రించక పోవడంతోనే సమస్య తలెత్తిందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఇదే పరిస్థితి నెలకొంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
నిత్యం ఇబ్బందులు
మండల కేంద్రంలోని జాతీయ రహదారి అధ్వానంగా ఉంది.చినుకు పడితే చిత్తడిగా మారుతుంది. గోతుల రహదారి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో తరచూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. అధికారులకు విన్నించినా పట్టించుకోవడం లేదు.ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలి.
–రాము, ఎటపాక

అధ్వానంగా జాతీయ రహదారి