
ఎమ్మెల్యే శిరీష అవినీతిని నిరూపిస్తా..
అడ్డతీగల: రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవిపై మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఫైరయ్యారు. అవినీతిని నిరూపిస్తా.. రాజీనామాకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. సోమవారం అడ్డతీగలలో ఎమ్మెల్యే శిరీష చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి అడ్డతీగలలో బుధవారం రాత్రి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. శిరీష చెప్పిన ప్రాంతానికి ఆధారాలతో వస్తానని, స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రంతో రావాలన్నారు. ఇటీవల ఎల్లవరంలో జరిగిన ‘బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ’ కార్యక్రమం విజయవంతం కావడంతో దేశం నాయకులు తట్టుకోలేకపోతున్నారన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన ప్రతిసారి ఎమ్మెల్యే శిరీషదేవి తనను విమర్శించడమే పనిగా పెట్టుకొని మీడియా సమావేశాలు పెడుతున్నారు తప్ప అభివృద్ధిపై చర్చించడం లేదన్నారు. తన పదవీ కాలంలో చేసిన అభివృద్ధి పనులు లెక్కలతో సహా సజీవంగా ఉన్నాయని పేర్కొన్నారు. శిరీషదేవి స్వగ్రామమైన గింజర్తి అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని, ఆమె అత్తగారి ఊరైన అనంతగిరిలో ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయులు లేరని విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన కూడా వ్యక్తం చేశారన్నారు. ముందు వాటిని ఎమ్మెల్యే శిరీష చక్కదిద్దుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యే అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని, దానికి సమయం వేదిక ఎమ్మెల్యే నిర్ణయించుకోవాలని సవాల్ విసిరారు. ఎటువంటి అవినీతికి పాల్పడకుండా సంవత్సర కాలంలో ప్రస్తుతం అనుభవిస్తున్న విలాసాలకు ఎక్కడి నుంచి నిధులు వచ్చాయని ప్రశ్నించారు. తన స్వగ్రామంలో జరిగిన ప్రభుత్వ పనుల్లో తన తల్లి, ప్రస్తుత సర్పంచ్ నాగులపల్లి రాఘవ అవినీతికి పాల్పడ్డారని ఎమ్మెల్యే ఆరోపించడం సరికాదని, ఆ గ్రామంలో పాఠశాలలకు అవసరమైన స్థలాన్ని కూడా తామే దానం చేశామని, అది తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.