
యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు
చింతపల్లి: రైతులు యాజమాన్య పద్ధతులతో సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని ఉద్యానవన పరశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త శెట్టి బిందు చెప్పారు. స్థానక ఉద్యానవన పరిశోధన స్థానంలో పాడేరు స్పైస్ బోర్డు సీనియర్ ఫీల్డ్ అధికారి బి.కళ్యాణి ఆధ్వర్యంలో గిరిజన రైతులు పండించే పసుపు, అల్లం, మిరియాలు పంటలలో అధిక దిగుబడులు సాధించేందుకు చేపట్టవలసిన అంశాలపై ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంతో మంచి దిగుబడులు సాధించలేకపోతున్నారన్నారు. పసుపు విత్తన శుద్ధి చేసుకొని, ఎత్తైన మడులతో నాటుకోవడంతో తెగుళ్లను నివారించుకోవచ్చన్నారు. మిరియాలు పంటలో నీడ నియంత్రణ పాటించాలని, రసాయన ఎరువులను వినియోగించొద్దన్నారు. జీవ, ఘనామృతం కషాయాలతో సాగు చేయాలని సూచించారు. స్పైస్ బోర్డు సీనియర్ ఫీల్డ్ అదికారి కళ్యాణి మాట్లాడుతూ రైతులకు సబ్సిడీపై పసుపు ఉడకబెట్టే, పాలిష్ చేసే యంత్రాలను, మిరియాలు వలిచి, శుభ్రపరిచే యంత్రాలను అందజేస్తున్నామని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 8919475787 నంబరును సంప్రదించాలన్నారు. వ్యవసాయ పరిశోధన స్థానం సేంద్రియ విభాగపు శాస్త్రవేత్త సందీప్‌నాయక్ వరి పంటలో తీసుకోవలసిన సస్యరక్షణ చర్యలు, మెలకువలను వివరించారు. వి.వి.ఎస్.టాటా ట్రస్టు నిపుణుడు డాక్టర్ అప్పలరాజు, ఎర్రబొమ్మలు, పెద్దూరు, కొండవంచుల గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.