
ఉధృతంగా గెడ్డలు
రాజవొమ్మంగి: గడిచిన రెండు రోజులుకు కురుస్తున్న భారీ వర్షాలకు గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాజవొమ్మంగిలో ఉదయం 8 గంటలకు 38.8 ఎంఎం వర్షపాతం నమోదైనట్టు జిల్లా గణాంకాధికారి మురళీకృష్ణ తెలిపారు. మధ్యాహ్నం కూడా భారీ వర్షం కురిసింది. భారీ వర్షాలకు నాగులకొండ ప్రాంతం నుంచి కొండవాగులు పొంగి ప్రవహిస్తు వట్టిగెడ్డ వాగులో కలుస్తున్నాయి. ఈ కారణంగా రాజవొమ్మంగి శివారు శాంతినగర్, శ్రీరాంనగర్, వట్టిగెడ్డ వద్ద ఎర్రంపాగు గ్రామానికి వెళ్లే మార్గంలోని చప్టాలమీదుగా వట్టిగెడ్డ వాగు ప్రమాద స్థాయిలో పరవళ్లు తొక్కుతోంది. వాగు ఉధృతి కారణంగా వయ్యేడు, బూరుగపల్లి, ముర్లవానిపాలెం, శాంతినగరం. గింజర్తి, ఎర్రంపాడు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆయా ప్రాంతాల్లో పొలం పనులకు వెళ్లిన వారు తిరిగి స్వగ్రామాలకు చేరేందుకు ఉధృత వాగులు అడ్డంకిగా మారాయి. వాగుల వద్ద పరిస్థితిని రాజవొమ్మంగి ఎస్‌ఐ నరనింహమూర్తి పర్యవేక్షిస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో వాగులు, గెడ్డలు దాటవద్దని హెచ్చరించారు. పోలీసు సిబ్బందితో బందోబస్త్ ఏర్పాటు చేశారు. ప్రమాదకర వాగులపై వంతెనలు నిర్మించాలని ఆయా గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భారీ వర్షాల కారణంగా రాజవొమ్మంగి మండలం అప్పలరాజుపేటలోని వట్టిగెడ్డ రిజర్వాయర్ పంటకాలువకు వరద ఉధృతి కారణంగా మంగళవారం రాత్రి గండి పడింది. సమస్య పెరగకుండా, గండ్లు విస్తరించకుండా మైనర్ ఇరిగేషన్ శాఖ సిబ్బంది కాలువ కట్టేశారు.
వట్టిగెడ్డ రిజర్వాయర్ పంట కాలువ పండూరు వారి పొలాల వద్ద వరద ఉధృతి పెరిగి గట్లపై నుంచి పొంగి ప్రవహిస్తోంది. ఈ ప్రాంతంలో పంట కాలువకు ఏటా గండి పడడం, ఆయకట్టు శివారు రైతులకు సాగునీరు అందకపోవడం పరిపాటిగా మారింది. గతంలో ఈ విధంగా గండ్లు పడగా రైతులు ఇసుక బస్తాలు వేసి తాత్కాలిక చర్యలు తీసుకున్నారు.
కొయ్యూరు: ఏకధాటిగా గంటల తరబడి కురిసింది. కుండపోత మాదిరిగా కుమ్మరించింది.దీని మూలంగా రోడ్లన్ని వర్షపు నీటితో నిండిపోయాయి. పంట పొలాలు పూర్తిగా నీరు చేరింది.కాలువలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.బుధవారం 11 గంటల నుంచి ప్రారంభమైన వర్షం ఏకదాటిగా కురిసింది. విరామం లేకుండా నాలుగు గంటల పాటు కురవడంతో కాకరపాడు, కొయ్యూరు, వట్టిగెడ్డ కాలువల ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం కురిసిన వర్షం మెట్ట పంటలకు మేటు చేస్తుందని రైతులు చెబుతున్నారు.
భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు
జలమయం
నిలిచిన రాకపోకలు
గెడ్డల వద్ద పోలీసుల పహారా

ఉధృతంగా గెడ్డలు

ఉధృతంగా గెడ్డలు

ఉధృతంగా గెడ్డలు