
కాఫీ శుద్ధి కర్మాగారాన్ని తరలించొద్దని వినతి
చింతపల్లి: కాఫీ శుద్ది కర్మాగారాన్ని మైదాన ప్రాంతానికి తరలించకుండా చింతపల్లిలోనే కొనసాగించాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ కోరారు. మండలంలోని గొందిపాకలు గ్రామంలో స్వాతంత్య్ర సమరయోధుడు బోనంగి పండుపడాల్ జయంతి కార్యక్రమానికి అధికారికంగా వచ్చిన కలక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో గిరిజన రైతులు కాఫీ పంటను వాణిజ్య పంటగా సాగుచేపడుతున్నారన్నారు. ముఖ్యంగా చింతపల్లి, జీకే వీధి మండలాల్లో అత్యదికంగా ఈ పంట సాగువుతుందన్నారు.ఈ పంటపైనే ఆధారపడి అనేక కుటుంబాలు జీవనాన్ని సాగిస్తున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో చింతపల్లిలో నెలకొల్పిన కాఫీ యూనిట్‌ను మైదాన ప్రాంతానికి తరలిస్తున్నట్టు ప్రచారం జరుగుతుందన్నారు.ఇప్పటికే జీఓ నెం3 ఎత్తివేతలో గిరిజన ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలను కోల్పోయారని, హైడ్రో పవర్ ప్రాజెక్టులు ద్వారా నీటిని కూడా గిరజనులు దక్కకుండా ప్రభుత్వం కుటిల ప్రయత్రాలు చేపడుతుందని విమర్శించారు.చింతపల్లిలో ఉన్నటువంటి కాఫీ యూనిట్‌ను మైదాన ప్రాంతానికి తరలించే ఆలోచన విరమించుకోకుంటే చింతపల్లిని అష్టదిగ్బందం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉపాద్యక్షులు పాంగి దనుంజయ్,కాపీ రైతు సంఘం ప్రతినిది బౌడు కుశలవుడు,జిల్లా ప్రతినిది జనకాని కనకారావు తదితరులు పాల్గొన్నారు.