
అప్పుల పాలవుతున్న ఆదివాసీలు
పెదబయలు మండలం పోయిపల్లిలో పీఎం జన్‌మన్ ఇంటికి స్లాబు నిర్మాణ పనులు జరుగుతున్న దృశ్యం
రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష సాయం అందిస్తామని జీవో జారీ చేయడంతో పీఎం జన్‌మన్ పథకంలో ఇల్లు మంజూరైన ఆదివాసీ కుటుంబాలు ఎంతో ఆనందించాయి. ఇంటి నిర్మాణం ఉత్సాహంగా ప్రారంభించాయి. ఇప్పుడు ఆ ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. కానీ కూటమి సర్కారు మాట నిలుపుకోకపోవడంతో గిరిజనులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిర్మాణ సామగ్రి, కూలీల ఖర్చులు అధికంగా ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నిధులు ఎటూ చాలని పరిస్థితి ఉంది. ఇంటి నిర్మాణం మధ్యలో ఆగిపోకుండా వ్యవసాయ, వాణిజ్య పంటల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం వెచ్చించడంతో పాటు పశువులను కూడా అమ్ముకుంటున్నారు. ప్రకటించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష సాయం అందిస్తే వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. జిల్లాలో ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం ఇంతవరకు రూ.356.55 కోట్లను లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అదనపు ప్రోత్సాహం అందించకపోవడంతో ఆదివాసీలంతా ఆగ్రహంతో ఉన్నారు. అనేక గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు గోడలు, స్లాబ్‌ల స్థాయిలో నిలిచిపోయాయి. అయితే ఇప్పటికే పూర్తయి గృహ ప్రవేశాలు జరిగిన 2,133 పీఎం జన్‌మన్ ఇళ్లకు కూడా రాష్ట్రం ఇవ్వాల్సిన రూ.లక్ష సాయం అందలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అదనపు సాయమేదంటూ గృహ నిర్మాణ సంస్థ అధికారులు, సిబ్బందిని ఆదివాసీలు నిలదీస్తున్నారు.

అప్పుల పాలవుతున్న ఆదివాసీలు

అప్పుల పాలవుతున్న ఆదివాసీలు