
డిమాండ్లు నెరవేర్చాకే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు నిర్
● లేదంటే సీలేరు ప్రాజెక్ట్‌ను అడ్డుకుంటాం ● దండకారణ్య విమోచన సమితి హెచ్చరిక
సీలేరు: పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రజాభిప్రాయ సేకరణ సభలో ఇచ్చిన హామీలను నెరవేర్చాకే ప్రాజెక్టు నిర్మించాలని, లేనిపక్షంలో జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో గిరిజన పక్షాన నిలబడి ప్రాజెక్టు పనులను అడ్డుకుంటామని దండకారణ్య విమోచన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మార్క్ రాజు డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మించే పార్వతీనగర్ సాండ్ కోరి, బూసుకొండ గ్రామాల ప్రజలతో జేఏసీ నాయకులు సోమవారం సమావేశం నిర్వహించారు. గత ఏడాది ప్రాజెక్టు నిర్మాణం కోసం సీలేరులో ప్రజాభిప్రాయ సేకరణ చేశారని, ఇందులో ఇంటికొక ఉద్యోగం, భూమి, ఇల్లు కోల్పోయిన వారికి పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారని, అదేమీ ఇవ్వకుండా రహస్యంగా పనులు జరపడం మోసం అని అన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుంకర విష్ణుమూర్తి మాట్లాడుతూ ప్రాజెక్టుకు అటవీ అనుమతులు రాకుండానే గోప్యంగా పనులు ప్రారంభించడం అనుమానంగా ఉందన్నారు. సీపీఎం మండల సహాయ కార్యదర్శి బుజ్జి బాబు మాట్లాడుతూ గిరిజనులకు వేరే చోట స్థలం ఇవ్వకుండా ఇళ్లు ఖాళీ చేయించడం దారుణమన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఈ ప్రాంత గిరిజనులకు అన్యాయం జరిగితే సహించేది లేదని, అవసరమైతే జైలుకై నా వెళ్తామని హెచ్చరించారు. పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందాకే గ్రామాన్ని ఖాళీ చేస్తామని, అప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు పెట్టినా ఉపేక్షించేది లేదని కూడా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దండకారణ్య విమోచన సమితి జిల్లా అధ్యక్షుడు మనోజ్‌కుమార్, గిరిజన సంఘం మండల అధ్యక్షుడు బలు, మండల గిరిజన సమాఖ్య అధ్యక్షుడు నాగేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ నాయకుడు బుజ్జి, జనసేన మండల ఉపాధ్యక్షుడు సిద్దార్థ్ మార్క్, స్థానిక సర్పంచ్ పి.దుర్జో, డీసీసీ కార్యదర్శి కారే శ్రీనివాస్ పాల్గొన్నారు.