
కుదిపేసిన కుండపోత వర్షం
● నీట మునిగిన పెదబయలు ● ఇళ్లలోకి ప్రవేశించిన నీరు
పెదబయలు: మండలంలో సోమవారం మధ్యాహ్నం కుండపోత వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత జనాన్ని వేధించింది. మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. పెదబయలు ప్రభుత్వ గ్రంథాలయం, అంగన్‌వాడీ కేంద్రం–2 నీట మునిగాయి. ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయం సమీపంలో డ్రైనేజీ మూసుకుపోవడంతో వర్షం నీరు రోడ్డుపైకి వచ్చి ఐటీడీఏ రెంటల్ హౌసింగ్ కాలనీలో ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. నివాసం ఉంటున్న వారు అవస్థలు పడ్డారు. కేంద్రానికి వచ్చిన పిల్లల తల్లిదండ్రులు మోకాళ్లలోతు వర్షం నీటిలో దిగి వెళ్లారు. ఈ వీధికి సీసీ రోడ్డు ఉన్నా డ్రైనేజీ లేకపోవడంతో వర్షం పడితే నీరు నిల్వ అవుతుందని, దీంతో వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటోందని, అధికారులు స్పందించి డ్రైనేజీ మంజూరు చేయాలని కాలనీ వాసులు, పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.
డుంబ్రిగుడ మండలంలో విభిన్న వాతావరణం
డుంబ్రిగుడ: ఉదయం మంచు, మధాహ్నం వర్షం కురవడంతో మండలంలో విభిన్న వాతావణం కనిపిస్తోంది. వారం రోజుల నుంచి ప్రతి రోజు మంచు కురుస్తుండటంతో చలికాలమో లేక వర్షకాలమో తెలియడం లేదని గిరిజనులు అంటున్నారు. ప్రస్తుతం వర్షాలు భారీగా కురుస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం మంచుతో ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు.

కుదిపేసిన కుండపోత వర్షం