
గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం వినతి
రంపచోడవరం: వై.రామవరం మండలం దాలిపాడు పంచాయతీ పరిధిలోని మునగపూడి గ్రామంలో మధ్యలో నిలిచిపోయిన అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని, పులుసుమామిడి గ్రామం నుంచి బూరుగుపాలెం గ్రామం వరకు మూడు కిలోమీటర్లు రోడ్డు ఏర్పాటు చేయాలని గిరిజనులు సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో విజ్ఞప్తి చేశారు. ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం, సబ్ కలెక్టర్ శుభమ్ నొఖ్వాల్ అర్జీలు స్వీకరించారు. పులుపుమామిడి– బూరుగుపాలెం గ్రామాల మధ్య మూడు కిలోమీటర్ల రోడ్డు ఏర్పాటు చేయాలని, అలాగే బూరుగుపాలెం–రేగడిపాలెం గ్రామం వరకు తొమ్మిది కిలోమీటర్ల రోడ్డు నిర్మించాలని గిరిజనులు పల్లాల పండురెడ్డి, పల్లాల ఎర్రంరెడ్డి తదితరులు పీవోకు అర్జీ అందజేశారు. రంపచోడవరం మండలం సోకులగూడెం గ్రామంలో సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని ఎంపీటీసీ నర్రి పాపారావు, చుంట్రూ అన్నవరం వినతి పత్రం ఇచ్చారు. వై.రామవరం మండలం వలస గ్రామంలో జీపీఎస్ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని సోమిరెడ్డి, చంద్రమ్మలు అర్జీలు అందజేశారు. చింతలపూడి పంచాయతీ పరిధిలో కన్నేరు వాగుపై వంతెన ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరారు. ఇంటి వద్ద జన్మించిన పిల్లలకు ఆధార్ కార్డులు మంజూరు చేయాలని సర్పంచ్ పల్లాల సన్యాసమ్మ, ఎంపీటీసీ జోగిరెడ్డి, మంగిరెడ్డి, ఆదిరెడ్డి అర్జీ అందజేశారు. ఈ వారం 47 అర్జీలు వచ్చినట్లు పీవో తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 47 అర్జీలు