
దమ్ము ట్రాక్టర్లు తిరగకుండా చర్యలు తీసుకోవాలని వినతి
రాజవొమ్మంగి: పక్కా రహదారులపై దమ్ము ట్రాక్టర్ల తిరగుకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, లోదోడ్డి సర్పంచ్ లోతా రామారావు , నేతలు ఎస్‌ఐ చినబాబుకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ దమ్ము ట్రాక్టర్లుకు ఉండే ఇనుప చక్రాల వల్ల రహదారులు చిధ్రమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దమ్ము ట్రాక్టర్లు రోడ్లపై తిరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని వినతిలో పేర్కొన్నారు. ఉద్యమాలు చేసి మా గ్రామాలకు బీటీ రోడ్లు వేయించుకొన్నామని, ఆ రోడ్లపై ట్రాక్టర్లు తిరిగి పాడు చేస్తుంటే అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరమని చెప్పారు. పోలీసు అధికారులు కూడా ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ కనపరచి రోడ్లపై తిరుగుతున్న ట్రాక్టర్ల లైసెన్స్ రద్దు చేయాలని కోరారు.